మంత్రి ఆది వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డి.. బాబు స‌త‌మ‌తం!

September 4, 2017 at 11:05 am

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి తెప్పిస్తున్నాయి. వైసీపీ నుంచి వ‌చ్చిన ఆదినారాయ‌ణ రెడ్డి, టీడీపీలోనే ఉండి సేవ‌లు చేస్తున్న రామ‌సుబ్బారెడ్డిల మ‌ధ్యఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరింది. నిజానికి వైసీపీ నుంచి ఆదిని టీడీపీలోకి పిలిచినప్పుడే.. సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించాడు. రెండు క‌త్తులు ఒకవొర సామెత‌ను ఆయ‌న తెర‌మీద‌కి తెచ్చాడు. అయినా కూడా బాబు ఇద్ద‌రికీ న‌చ్చ‌జెప్ప‌డంతో అప్ప‌టికి స‌ర్దుకు పోయారు. దీంతో ఆదికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు బాబు.

ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి ఆది బాగానే ప్ర‌చారం చేశాడు. దీంతో బాబుకు ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఇక‌, రామ‌సుబ్బార‌డ్డి విష‌యానికి వ‌స్తే.. ఆది చేరిక‌తో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడంతో తిరిగి పుంజుకున్నాడు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా… ఇప్పుడు ఆదికి, సుబ్బారెడ్డికి మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగిపోయింద‌ని అంటున్నారు. గతంలో జమ్మలమడుగు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా రామసుబ్బారెడ్డి తన తమ్ముడు గిరిధర్‌ రెడ్డి పేరును ప్రతిపాదించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తన కుమారుడు సుధీర్‌ రెడ్డిని చైర్మన్‌గా నియమించాలని పావులు కదిపారు.

ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని రామసుబ్బారెడ్డి తన తమ్ముడికే పదవి కట్టబెట్టాలని పట్టుబట్టారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎంపిక వాయిదా వేయాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది. అధిష్ఠానం నిర్ణయంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి ఆది ప్ర‌క‌టించేశారు.

ఆయ‌న అక్క‌డితో ఆగ‌కుండా పట్టుబట్టి తన కుమారుడికి పదవి కట్టబెడతామని కూడా చెప్పుకు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాను అనుకున్నది జరగకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇటు త‌న త‌మ్ముడికి ప‌ద‌వి రాక‌పోతే తాను పార్టీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న స‌వాల్ చేస్తున్నారు. ఈ పరిణామలతో జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కింది. దీంతో ఇప్పుడు ఎవ‌రికి స‌ర్ది చెప్పాలో తెలియ‌క బాబు స‌త‌మ‌త‌మైపోతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

 

మంత్రి ఆది వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డి.. బాబు స‌త‌మ‌తం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share