తెలంగాణలో వెల్లువలా ముంచుకొస్తున్న అసంతృప్తి సెగ

మా ప్రాంతం వారికే ఉద్యోగాలు, మా నీళ్లు మాకే సొంతం- నినాదంతో ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడిన సంగ‌తి తెలిసిందే! కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మ‌రోసారి మ‌ళ్లీ ఈ నినాదంతో పోరాటం రాబోతోందా? తెలంగాణను విభ‌జించి మ‌రో రాష్ట్రం చేయాల‌నే ఉద్య‌మాలు రాబోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ అనే మాట‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ‌పై సీఎం కేసీఆర్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆ ప్రాంత నాయ‌కులు విమ‌ర్శలు చేస్తున్నారు. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే త్వ‌ర‌లో ప్ర‌త్యేక‌ ద‌క్షిణ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

త‌మ నీళ్లు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఆంధ్ర ప్రాంత ప్ర‌జ‌లే ఎక్కువ‌గా ఉంటున్నార‌ని, తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని, త‌మకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ నేత‌లు ఉద్య‌మాలు చేశారు. ఎన్నో పోరాటాలు చేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అనంత‌రం సీఎం కేసీఆర్‌.. అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న విష‌యం కూడా తెలిసిందే! అయితే ఇదే స‌మ‌యంలో మ‌రోసారి ప్రాంతీయవాదం తెలంగాణ‌లో తెర‌పైకి వ‌చ్చింది. ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ‌గా రాష్ట్రాన్ని విభ‌జించి చూస్తున్నారు నాయ‌కులు. దీంతో విభ‌జ‌న వాదం అక్క‌డ‌క్క‌డా ఆయా ప్రాంతాల్లో వినిపిస్తోంది.

దక్షిణ తెలంగాణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివక్షను ప్రదర్శిస్తున్నారని, ఇలానే కొనసాగితే ప్రత్యేక రాష్ట్రం కోసం మరో ఉద్యమం తప్పదని కాంగ్రెస్ నేత‌, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే రైతులకు నష్టం జరుగుతుందని విమ‌ర్శించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ ,రంగారెడ్డి పాతజిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజలను విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే సీఎం కేసీఆర్‌ రాజకీయ కుట్ర వల్ల భవిష్యత్తులో జలయుద్ధం వచ్చే ప్రమాదముందని సూచించారు.

టీఆర్‌ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఖరీఫ్‌కు కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద నీరు అందించకపోతే ఉద్యమం చేసి సాధించుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు ఉన్నా కల్వకుర్తికి నీళ్లు లేవని విమర్శించారు. మ‌రి ప్ర‌త్యేక ఉద్య‌మానికి కాంగ్రెస్ నేత‌లు శ్రీ‌కారంచుడ‌తారో లేక‌.. మాట‌ల‌తో స‌రిపెడ‌తారో వేచిచూడాల్సిందే!!