‘అజ్ఞాత‌వాసి’ రుణం తీర్చుకోలేనిది.. రీజ‌న్ ఇదే

January 29, 2018 at 2:27 pm

జ‌న‌సేనాని రాజ‌కీయ క్షేత్రంలో చ‌క‌చ‌కా అడుగులు వేస్తున్నారు. తాను కూడా రాజ‌కీయ యాత్ర‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత రోజు నుంచే వీటికి శ్రీ‌కారం చుట్టేశారు ప‌వ‌న్‌! అంత తొంద‌ర‌గా ఆయ‌న ఎందుకు యాత్రాల‌ను ప్రారంభించారు ?  దీని వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఏమైనా ఉన్నాయా? రాజ‌కీయాలా?  సినిమాలా? అని తేల్చుకోలేకపోతున్న స‌మ‌యం లో ఏ సంఘ‌ట‌న ఆయ‌న్ను రాజ‌కీయాల వైపు మ‌ళ్లించేలా చేసింది? అనే సందేహాలు అంద‌రిలోనూ ఉన్నాయి. వీట న్నింటికీ ఒకే ఒక్క స‌మాధానం `అజ్ఞాత‌వాసి`. ఈ సినిమా ఫ‌లితం ప‌వ‌న్ రాజ‌కీయ భవిష్య‌త్‌కు దిశానిర్దేశం చేసింద‌నే చెప్పుకోవాలి. ఒక‌ సినిమా విజ‌యం హీరోను ఆకాశంలో  కూర్చోపెడుతుంది..  అదే ఫెయిల్ అయితే భ‌విష్య‌త్ అంతా ప్ర‌శ్నార్థ‌కం అయిపోతుంది. కానీ ప‌వ‌న్‌కు మాత్రం రాజ‌కీయాల‌పై క్లారిటీ వ‌చ్చేలా చేసింది.. అదెలా అంటే 

త్రివిక్ర‌మ్‌-ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్‌ సినిమాల త‌ర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. `అజ్ఞాత‌వాసి` సినిమాపై ప‌వ‌న్ అభిమానులే గాక‌, ఇండస్ట్రీలోని చాలామంది చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. కానీ ఇవ‌న్నీ త‌ల్ల‌కిందు ల‌య్యాయి. చిత్రం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. దీంతో అభిమానులు నిరాశ చెందినా.. ప‌వ‌న్‌కు మాత్రం మేలు చేసింద‌నే చ‌ర్చ మొద‌లైంది. గెలుపే కాదు ఓట‌మి కూడా స‌రికొత్త దారి చూపుతుంద‌ని రుజువుచేసింది. 

ఓ అయిడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ, ఓ సినిమా ఓ స్టార్ హీరో నిర్ణయాలనే మార్చేసింది. 

అజ్ఞాతవాసి సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ వస్తే, ఇలా చేస్తే బాగుంటదని ఓ రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నా రు ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌. ఇందులో ముందుగా అమెరికాలో పవర్ స్టార్ అభిమానులను కలిసే కార్యక్రమం ఉంది. అజ్ఞాతవాసి సినిమాను భారీ రేటుకు అమెరికా బయ్యర్ కొన్నారు. కొనడమే కాదు, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా విడుదలవనన్ని స్క్రీన్లలో విడుద‌ల చేశారు. అందుకే పాజిటివ్ టాక్ వస్తే, పొంగల్ టైమ్ కు అమెరికా వెళ్లాలని పవన్ అండ్ త్రివిక్రమ్ అనుకున్నారు. అటు నుంచి వచ్చాక, ఓరోజు బెంగళూరు వెళ్లి ఫ్యాన్స్ మీట్ పెట్టాలని, అలాగే విశాఖలో సక్సెస్ ఫంక్ష‌న్ చేయాలనీ అనుకున్నారు.

కానీ వాటన్నింటినీ మార్చేసింది అజ్ఞాతవాసి ఫలితం. అంతేకాదు పొలిటికల్ గా ముందుకు వెళ్లాలా? వెనక్కు వెళ్లాలా? వెళ్తే ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అంటూ ఓ అనిశ్చితిలో ఉన్న పవన్ ను చటుక్కున నిర్ణయం తీసుకునేలా చేసింది అజ్ఞాతవాసి. ఇప్పుడు చకచకా పవన్ రాజకీయంగాముందుకు కదులుతున్నారు. రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌పైనే పూర్తిగా దృష్టిపెడుతున్నారు. అజ్ఞాత‌వాసి ప‌వ‌న్‌లోని న‌టుడిని నిరాశ‌ప‌రిచినా.. ఆయ‌న‌లోని నాయ‌కుడిని వెలుగులోకి తెచ్చేలా చేసింది. 

 

‘అజ్ఞాత‌వాసి’ రుణం తీర్చుకోలేనిది.. రీజ‌న్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share