లక్ష్మీ అహంకారం, పవన్ సహించగలరా?

August 11, 2019 at 1:40 pm

పవన్ కల్యాణ్ మౌలికంగా సినిమా హీరో. ఆ రంగంలో సెలబ్రిటీలుగా ఎదిగిన వారికి విపరీతమైన అభిజాత్యం ఉంటుంది. ప్రజలందరూ వెర్రిగా ఎగబడుతుంటారు గనుక తాము దైవసమానులం అనే భావనలో వారు జీవిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇలాంటి బుద్ధులు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చాలా తక్కువ. అలాగని పూర్తిగా, అస్సలు లేవని మాత్రం అనలేం.

అలాంటి నాయకుడు గనుకనే.. నేను సీఎం అయి సేవ చేస్తా అంటూ జనసేన పార్టీని స్థాపించారు. ప్రయారిటీ జనానికి సేవ మాత్రమే అయితే.. మాతో కలిసి ఉండి చేయవచ్చు కదా.. అని కొన్ని పార్టీలు ప్రతిపాదించినప్పుడు… నో చెప్పడం కూడా బహుశా అందుకే కావొచ్చు. ఇతర పార్టీల్లో తన ‘కేంద్ర బిందువు’గా ఉండడం సాధ్యం కాదు కాబట్టే కావొచ్చు.

అలాంటి పవన్ కల్యాణ్.. తన పార్టీలో ఉన్న వారు.. అహంకారం ప్రదర్శిస్తే సహిస్తారా? సానుకూలంగా తీసుకుంటారా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. పార్టీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ వివాదానికి కేంద్ర బిందువు. జనసేన ను వీడి లక్ష్మీనారాయణ వేరే పార్టీలోకి వెళతారనే ప్రచారం నేపథ్యంలో ఈ చర్చ జనంలో వినిపిస్తోంది.

ఇలాంటి పార్టీ మారే ప్రచారాన్ని లక్ష్మీనారాయణ ఖండించారు. అయితే ఆయన ఖండన కూడా చిత్రంగా ఉంది. ‘‘తన అవసరం పార్టీకి ఉందని, తాను పార్టీకి పనికొస్తానని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ భావించే వరకూ జనసేనలోనే కొనసాగుతానని’’ మాత్రమే ఆయన చెప్పారు. చాలా స్పష్టంగా తనకు పార్టీ అవసరం లేదన్నట్టుగానే ఆయన సంకేతాలు ఇచ్చారు. కనీసం పార్టీతో బంధం గురించి ఎలాంటి మెలోడ్రమటిక్ డైలాగులు కూడా చెప్పలేదు.

ఆయన ప్రదర్శించిన ఈ అహంకారాన్ని పవన్ కల్యాణ్ ఎలా స్వీకరిస్తారనేది కీలకం. లక్ష్మీనారాయణ మాటల ప్రకారం.. అయితే పార్టీకి అవసరం ఉన్నంత వరకే ఆయన అక్కడ ఉంటారట. ‘అవసరం లేదనే’ సంగతి పవన్ ఆయనకు ఎలా కమ్యూనికేట్ చేయాలి? అనేది ప్రజల్లో ప్రశ్న. ఇప్పటికే పార్టీ తరఫున నియమించిన ఎలాంటి కీలక కమిటీల్లోనూ స్థానం లేకుండా చేశారు పవన్. ఈ సంకేతాన్ని లక్ష్మీనారాయణ అందుకోకుంటే ఎలా?

లక్ష్మీ అహంకారం, పవన్ సహించగలరా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share