ప‌వ‌న్‌కు అది అందని ద్రాక్షేనా…!?

May 14, 2019 at 3:35 pm

పిట్ట‌పోరు పిట్ట పోరు పిల్లి తీర్చే అన్న సామేత అంద‌రికి తెలిసిందే. అలాంటి సామేత క‌ర్నాట‌క రాజ‌కీయాల‌కు అతికిన‌ట్టు స‌రిపోయింది. అదే సామేత మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు అతికిన‌ట్టు స‌రిపోతుందా అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఏపీ రాజ‌కీయాలు చూస్తుంటే ఎవ‌రికి అంతుచిక్క‌డం లేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులే అంటున్నారు. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మా పార్టీకే ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని ప‌లు పార్టీల నాయ‌కులు ఎవ‌రికి వారే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రి ధీమా చూసినా అధికారం మాదే అంటే మాదే అంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో క‌ర్నాటక ఫ‌లితాలు ఏమైనా ఆస్కారం ఉందా అనే అంచ‌నాలు వేసేవారు లేక‌పోలేదు.

2014 ఎన్నిక‌ల‌ను ఓమారు ప‌రిశీలిస్తే అక్క‌డ టీడీపీ క‌న్నా వైఎస్సార్ పార్టీకి ఓటు శాతం 2% తక్కువే . కాని సీట్లు చూస్తే వైఎస్సార్ పార్టీ క‌న్నా టీడీపీకి మెజారిటీ స్థానాలు వ‌చ్చాయి. దీంతో ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఆధ‌రించినా, అధికారం క‌ట్ట‌బెట్ట‌లేదు. అదే టీడీపీని ప్ర‌జ‌ల ఆధ‌రించ‌కున్నా అధికారం మాత్రం ఇచ్చారు. అదే కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం అనుకున్నంత మేర వ‌చ్చిన‌ప్ప‌టికి ఒక్క సీటును గెలుచుకోలేక పోయింది. ఇప్ప‌టి ప‌రిస్థితే ఇప్పుడు పునఃరావృతం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

2014 ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు జ‌రిగినా కేవ‌లం రెండు ప‌క్షాల‌నే ప్ర‌జ‌లు ఆద‌రించారు. టీడీపీ ఓట్ల శాతం త‌గ్గినా సీట్లు గెలవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అటు బీజేపీ, ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన చ‌లువేన‌న్న‌ది సుస్ఫ‌స్టం. టీపీడీ బీజేపీ పొత్తుతో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌గా, జ‌న‌సేన ఆధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చంద్ర‌బాబు కు మ‌ద్ద‌తుగా ఏపీలో ప్ర‌చారం చేశారు. టీడీపీకి బీజేపీ పొత్తు, జ‌న‌సేన మ‌ద్ద‌తు లాభించ‌గా, ఒంట‌రిగా పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ అధికారానికి దూర‌మ‌య్యింది. త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌న‌సేన ఆధినేత ప‌వ‌న్ టీడీపీకి దూరం జ‌రిగాడు. ఇక బీజేపీ ఆధినాయ‌క్వ‌తంపై అసంతృప్తితో చంద్ర‌బాబు బీజేపీ బందాన్ని తెంపుకున్నాడు. ఏదేమైనా గ‌త ఎన్నిక‌లు ఏపీ రాజ‌కీయ నాయ‌కులకు మంచి గుణ‌పాఠాన్ని నేర్పాయి.

2018లో జ‌రిగిన క‌ర్నాట‌క ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా ఒక సంచ‌ల‌నం క‌లిగించాయి. క‌ర్నాట‌క‌లోని 224 స్థానాల‌కు బీజేపీ 104 స్థానాల‌ను గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలువ‌గా, కాంగ్రెస్ 80 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఇక జ‌న‌తాద‌ళ్ సెక్యుల‌ర్ పార్టీ కేవ‌లం 37 సీట్లు, ఇండిపెండెంట్‌, బీఎస్పీ, క‌ర్నాట‌క ప్ర‌జ్ఞావంత జ‌న‌తా పార్టీ లు ఒక్కోక్క సీటు చొప్పున గెలిచాయి. ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీ కాకుండా మ‌ధ్యేమార్గంగా కేవ‌లం 37సీట్లు పొందిన జ‌నతాద‌ళ్‌(ఎస్‌) పార్టీ అధికారం చేజిక్కించుకుంది. రాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌, బీఎస్సీ, కెపిజెపీ పార్టీలు జేడిఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టంతో అన్యూహంగా జేడీఎస్ ఆధినేత దేవేగౌడ కొడుకు కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కాడు. ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీకి సాధార‌ణ మెజారిటీకి అడుగు దూరంలో నిల‌వడం, కాంగ్రెస్‌కు ఆ పీఠం అందే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వెంట‌నే పావులు కదిపిన కాంగ్రెస్ అధిష్టానం జేడిఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో కుమార‌స్వామికి జాక్ పాట్ త‌గిలిన‌ట్లు అయింది. కాంగ్రెస్ ఎత్తుగ‌డ బీజేపిని అధికారానికి దూరం చేయ‌గా, అనుకోని అవ‌కాశం కుమార‌స్వామికి త‌గిలి సీఎం కుర్చి ఎక్కాడు.

క‌ర్నాట‌క ప‌రిస్థితి ఏపిలోను జ‌రుగొచ్చ‌నే ఆశ‌తో అంప‌శ‌య్య‌పై ఉన్న జ‌న‌సేన పార్టీకి జీవం పోశాడు. సినిమాల‌కు తాత్కాలిక విరామం ప్ర‌క‌టించి పూర్తిస్థాయిలో రాజ‌కీయాలు చేశారు. రాజ‌కీయ యాత్ర‌లు, స‌భ‌లు, స‌మావేశాలు, ఆందోళ‌న‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేశారు. అయితే ఏపీలో బ‌లంగా ఉన్న టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా జ‌న‌సేన నిల‌బ‌డ‌గ‌లిగింది. కాని అవి ఎంత వ‌ర‌కు ఓట్లుగా మ‌లుచుకోగ‌లిగార‌న్న‌దే ఇక్కడ ముఖ్యం. గ‌త 2014ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో టీడీపీ 103 స్థానాలు గెలుచుకొని సాధార‌ణ మెజారిటీ అయిన 88 బేంచ్ మార్క్‌ను దాట‌గ‌లిగింది.

ఇప్పుడు 2019ఎన్నిక‌ల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ న‌డుమ పోరు హోరాహోరీగా సాగింద‌ని ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి రాజ‌కీయ పండితులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ పోరులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అశించిన‌ట్లుగా కర్నాటక ఫ‌లితాలు ఇక్క‌డ సంభ‌వించేనా అనేదే అనుమానం. టీడీపీ, వైఎస్సార్ సీపీల‌కు సాధార‌ణ మెజారిటీ రాక‌పోతే జ‌న‌సేన గెలిచే సీట్లే కీల‌కం అవుతాయి. కానీ ఏ పార్టీకి సాధార‌ణ మెజారిటీ స్థానాలు వచ్చినా ప‌వ‌న్ కోరిక‌, ఆశ‌లు నెర‌వేర‌క‌పోవ‌చ్చు. ఇప్ప‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్ సీపీ, బీజేపీ పార్టీలు 175 స్థానాల్లో ఒంట‌రిగా పోటీ చేశాయి. జ‌న‌సేన 140, బిఎస్పీ 21, సీపీఐ ఎం 7, సీపీఐ 7 స్థానాల చొప్పున కూటమిగా ఏర్ప‌డి పోటీ చేశాయి. జ‌న‌సేన కూట‌మి క‌ట్టి త‌న స‌త్తా చాటుతుందా… లేక చ‌తికిల ప‌డుతుందా..?, అదే విధంగా టీడీపీ, వైఎస్సార్ సీపీలు సాధార‌ణ మెజారిటీ సాధిస్తాయా లేక అటు బిజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు సాధించే సీట్ల‌పై ఆధార ప‌డుతాయా అనేది ఈనెల 23న తేల‌నుంది.

ఏదేమైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాక్‌పాట్ కొట్టె అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్ సాధించే సీట్లే ఆయ‌న భ‌విష్య‌త్ నిర్ణ‌యించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క‌ర్నాట‌క ఫ‌లితాలు ఏపీలో వ‌స్తే, అది జ‌న‌సేన సాధించే సీట్లు కీల‌కం అవుతాయి. అప్ప‌డు జ‌న‌సేన పార్టీ జేడిఎస్ లాగా 40సీట్ల‌లో విజ‌యం సాధిస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశించిన‌ట్లుగా జ‌రుగుతుంద‌ని ప‌రిశీల‌కుల అంచనా. అదే కేవ‌లం సింగిల్ డిజిట్‌కు ప‌రిమితం అయితే మాత్రం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో నామమాత్రంగా మిగిలిపోక త‌ప్ప‌దని అంటున్నారు. సో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సాధించే సీట్లే ఆయ‌న భవిష్య‌త్‌ను మార్చ‌బోతున్నాయి క‌నుక ఆయ‌న భ‌విష్య‌త్‌ 23వ తేదిన తేలిపోతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ప‌వ‌న్‌కు అది అందని ద్రాక్షేనా…!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share