జరగబోయేదానికి ముసుగువేసిన పవన్!

July 8, 2019 at 10:33 am

‘‘పైకి ఏది చెప్తావో.. అది నువ్వు కాదు’’ అంటూ ఆ మధ్య వచ్చిన ఓ త్రివిక్రమ్ సినిమాలో అద్భుతమైన డైలాగు ఉంది. నిజజీవితంలోనూ వ్యక్తుల వ్యవహార శైలికి కూడా వర్తించే సిద్ధాంతం ఇది అని మనకు పలుమార్లు అనిపిస్తుంది. చాలా మంది మనుషులు.. పైకి ఒకటి చెబుతూ ఉన్నప్పటికీ.. లోపల తద్విరుద్ధమైన మరో ఆలోచన వారిలో రన్ అవుతుంటుంది. ఇప్పుడు.. జనసేనాని పవన్ కల్యాణ్ మాటలు కూడా ఇలాగే కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఆయన మాట్లాడుతున్నారు.

అమెరికా నుంచి పవన్ కల్యాణ్ ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమాషా ఏంటంటే.. ఆయన ఇక్కడే.. అనగా హైదరాబాదులో గానీ, అమరావతిలో గానీ ఉన్నప్పుడు తెలుగు చానెళ్ల వారికి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ప్రెస్ మీట్లు కూడా బాగా తగ్గించారు. అలాంటి పవన్ కల్యాణ్ అమెరికానుంచి మాత్రం తెలుగు చానెల్ విలేకరికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక మర్మం ఉందని అనుకోవాలి. ఎందుకంటే… పవన్ కల్యాణ్.. అమెరికాలో భాజపా నేత రాంమాధవ్ తో భేటీ అయ్యాడని… త్వరలోనే జనసేన పార్టీని భాజపాలో విలీనం చేసేయబోతున్నాడని అనేక పుకార్లు తెలుగునాట వ్యాపించాయి. ఆ క్షణానికి ఆ పుకార్రల నుంచి బయటపడడానికి పవన్ కు ఇంకోమార్గం కనిపించినట్లు లేదు.

ఆ ఇంటర్వ్యూలో ‘జనసేనను భాజపాలో విలీనం చేయబోయేది లేదు’ అని పవన్ చెప్పారు. అయితే భాజపా మీద ప్రేమ ఒలకబోశారు. తాను ఎప్పుడూ వారికి వ్యతిరేకం కాదన్నారు. ప్రత్యేక హోదా పై స్పష్టత ఇస్తే చాలని కూడా సెలవిచ్చారు. ముందు చెప్పుకున్న సిద్ధాంతం ప్రకారం.. బయటకు ఏది చెప్పారో అది పవన్ కల్యాణ్ అసలు ఆలోచన కాదు అని అనుకోవాల్సి వస్తోంది.

భాజపాను ప్రేమిస్తూ, పొగుడుతూ.. విలీనం లేదని అంటున్నారంటే.. త్వరలోనే సరైన సమయం చూసుకుని విలీనం అనే ప్రహసనాన్ని పూర్తి చేస్తారని కూడా నమ్మకం చిక్కుతోంది. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అని సామెత. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యాక.. అక్కడినుంచే పుట్టిన జనసేన.. మాత్రం మరో తెరువు చూసుకుని విలీనం కాకుండా ఉంటుందా?

జరగబోయేదానికి ముసుగువేసిన పవన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share