పీకే స‌ర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేల‌పై యాంటీ రిపోర్ట్ 

`ప్ర‌జ‌ల‌కు నిరంతరం చేరువ‌కావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్న‌మాట‌. ప‌లు స‌ర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగ‌లు ర‌గులుతున్నాయ‌న్న విష‌యం గ్ర‌హించిన ఆయ‌న ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవ‌డం లేద‌ట‌. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుక‌న్న వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలోనూ ఇదే ఫ‌లితాలు రావ‌డంతో వైసీపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి. కేవ‌లం వైసీపీ నేత‌ల బ‌లాబ‌లాలే కాక‌.. టీడీపీ ఎమ్మెల్యేల గురించి కూడా బృంద స‌భ్యులు సర్వే చేస్తున్నారు. ఇందులో ఆ ఎమ్మెల్యేల గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయ‌ట‌.

ప్ర‌శాంత్ కిషోర్ బృందాలు బ‌రిలోకి దిగిపోయాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయికి వెళ్లి ప్ర‌జా నాడిని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ‌లితాలు వైసీపీ శ్రేణుల్లో స‌రికొత్త జోష్ నింపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వేలో మాత్రం అధికార టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కన్పిస్తున్నట్లు వెల్ల‌డైంద‌ట‌. ప్రశాంత్ కిషోర్ బృంద సభ్యులు కేవలం వైసీపీకి చెందిన క్యాడర్ నే కాకుండా సామాన్యుల నాడిని కూడా తెలుసుకుంటున్నారు. సామాన్యుల వాణి ఎలా ఉంది? వారి ప్రధాన సమస్యలేంటి? ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు వంటి విషయాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇందులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన 80 శాతం మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దాదాపు 80 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే నివేదికలు ప్రశాంత్ కిషోర్ వద్దకు చేరుకున్నట్లు సమచారం. వీటిని పరిశీలిస్తుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగా లేదని ఫలితాలు వ‌చ్చాయ‌ట‌. ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు. ఎమ్మెల్యేల బంధువులు, సన్నిహితులే కాంట్రాక్టర్లుగా మారారని సర్వేలో స్పష్టమైంది. సంక్షేమ పథకాలను కూడా కొందరికే అమలు చేస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.

పింఛన్లు వంటి వాటి విషయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన జన్మభూమి కమిటీల జోక్యం పెరిగిపోయిందని కొందరు వివరించారు. ఎమ్మెల్యేలయితే తాము అడిగినా పట్టించుకోలేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు నియోజకవర్గంలోనే ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే సమర్థులైన నేతలు ఎవరని అడిగిన ప్రశ్నలకు కూడా కొందరు సమాధానాలు చెప్పార‌ట‌. నియోజక‌వ ర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు మూడేసి చొప్పున రూపొందించారట‌. మొత్తానికి పీకే స‌ర్వే వైసీపీలో కొత్త ఆశ‌లు చిగురించేలా చేస్తోంది.