విదిలించుకుని వెళ్లిపోయినా, మేడమ్‌ను వదల్లేదు

August 11, 2019 at 1:48 pm

రాజమౌళి తీసిన యమదొంగ చిత్రంలో ఒక సీక్వెన్స్ ఉంటుంది. చిన్నతనంలో తనకు పరిచయం అయిన ఒక అమ్మాయి ఎన్టీఆర్ కు మెడలో వేసుకునే లాకెట్ తో కూడిన తాడు ఇస్తుంది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో దాని వల్లనే తన ఖర్మ కాలిపోతోందనే భావనతో హీరో.. దాన్ని ఎక్కడెక్కడో విసరి కొడుతుంటాడు. కానీ చాలా చిత్రంగా రకరకాల పరిణామాల తర్వాత అది తిరిగి ఎన్టీఆర్ చేతిలోకే వచ్చి పడుతుంటుంది… అదే తరహాలో…

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షకిరీటం తిరిగి సోనియా గాంధీ నెత్తి మీదికే చేరుకుంది. ‘సోనియా-గాంధీ’ కుటుంబం దాన్ని వదిలించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సోనియా దానిని కొడుకు నెత్తిమీదకు తోసేస్తే.. ఆ కొడుకు ఓటమి పూర్తయిన వెంటనే.. తనకు మాత్రం వద్దనే వద్దు.. అంటూ పక్కనపారేసి పలాయనం చిత్తగించాడు. పార్టీ మల్లగుల్లాలు పడి ఆ కిరీటాన్ని ఎత్తి మళ్లీ ఆమె నెత్తినే పెట్టింది.

కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం.. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం అనేది చాలా ప్రహసన ప్రాయంగా జరిగింది. అధ్యక్షుడి ఎంపికకోసం అయిదు కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో తమ పేర్లు కూడా ఉండడంతో సోనియా, రాహుల్ ఖంగు తిన్నారు. తమకు కమిటీల్లో చోటు వద్దు అంటూ.. వారు సమావేశం మధ్యలోనే.. తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్టీ మాత్రం సోనియమ్మనే అధ్యక్షురాలిని చేసింది. వారు పార్టీని అలా విదిలించుకుని వెళ్లిపోయినా సరే.. తిరిగి వారి నెత్తినే కిరీటం పెట్టడమే ఆ పార్టీ వైఖరిగా ఉంది.

సోనియా ముద్ర లేకుండాపోతే.. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటి కంటె కనాగష్టంగా మారిపోతుందని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారనడానికి ఇది చిహ్నం. పగ్గాలు అందుకోవడానికి, పార్టీని సమర్థంగా నడపడానికి సరిపడా కీలక నాయకులు, సమర్థులు, యువకులు ఆ పార్టీలో పుష్కలంగానే ఉన్నారు. కానీ.. వారి చేతుల్లో పగ్గాలు పెట్టడానికి మాత్రం ఇంకా రకరకాల సంకోచాలు పార్టీని వెన్నాడుతున్నాయని అర్థం అవుతోంది.

విదిలించుకుని వెళ్లిపోయినా, మేడమ్‌ను వదల్లేదు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share