
ప్రముఖ జ్యోతిర్లింగ శివక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం కిక్కిరిసిపోయింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో పాటు అటు కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో శ్రీశైలం గేట్లు ఎత్తి కృష్ణమ్మ నీటిని సాగర్‌లోకి వదలడంతో సందర్శకులు, యాత్రికులు భారీగా తరలివచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భారీ సంఖ్యలు సందర్శకులు రావడంతో శ్రీశైలం కిక్కిరిసిపోయింది. పై నుంచి వరద కంటిన్యూగా వస్తుండడంతో శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 30 అడుగుల పైకెత్తడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది.
భారీగా తరలి వచ్చిన సందర్శకులు ఈ అందాలను తిలకిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆనకట్ట మీదుగా శ్రీశైలం చేరుకోవడానికి వేలాది వాహనాలు రావడంతో ఘాట్ రోడ్డులో సుమారు 43 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం చరిత్రలోనే ఇదే భారీ ట్రాఫిక్ జామ్‌గా రికార్డులకు ఎక్కింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి 2 గంటలకు శ్రీశైలం చేరుకున్నారు.
కొంతమంది ట్రాఫిక్ జామ్ కావడంతో మధ్యలోనుంచే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఇక శ్రీశైలం చేరుకున్నాక కూడా మల్లన్నను దర్శించుకునేందుకు చాలా టైం క్యూలో ఉండాల్సి వచ్చింది. ఉచిత దర్శనానికే ఏడు గంటల పాటు నీరిక్షించాల్సి వచ్చింది. ఇక ప్రత్యేక, అతి శీఘ్రదర్శనాలకు కూడా నాలుగు గంటలకు పైగా టైం పట్టింది. ఇక ఈ శ్రావణ మాసంలో ఒకే రోజున ఏకంగా లక్షన్నర మంది భక్తులు రావడం ఇదే ప్రథమం అని కూడా ఆలయ అధికారులు వెల్లడించారు.