సుజనా.. మోడీ ఏజెంటులా మాట్లాడుతున్నాడా?

August 12, 2019 at 10:40 am

సాధారణంగా రాజకీయ నాయకులు.. ఒక వ్యూహం అనుసరిస్తూ ఉంటారు. తాము చేయదలచుకుంటున్న ఒక పనిపట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వారికి భయం ఉంటే.. ముందుగానే దాని మీద ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తున్నదో.. ఎలాంటి అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వీలైతే.. ఇలాంటి ఫీలర్లు ఇవ్వడం ద్వారా.. తాము తీసుకోబోయే నిర్ణయానికి.. అనుకూలంగా ప్రజల ఆలోచనల్ని ట్యూన్ చేస్తారు. ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటారు! ఇందుకోసం తమ పార్టీలోనే కొందరు నాయకుల్ని వారు ఏజెంటుగా వాడుకుంటారు!!

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సైతం అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు మనస్తాపం కలిగించేలాగా.. మోడీ సర్కారు తీసుకోబోతున్న కొన్ని నిర్ణయాల గురించి ఉద్దేశ పూర్వక లీకులు ఇచ్చే బాధ్యతను కొత్తగా పార్టీలోకి వచ్చిన సుజనా చౌదరి తీసుకుంటున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే బాగా యాక్టివ్ అవుతూ సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు. జగన్ ప్రభుత్వం మీద కూడా ఎడాపెడా విమర్శలు కురిపిస్తున్నారు.

తాజాగా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం కాంట్రాక్టు రద్దు అనేది జగన్ చేసిన అతిపెద్ద తప్పు కింద సుజనా అభివర్ణించారు. కాంట్రాక్టరు ఎవరు అనేది పట్టించుకోకుండా.. ప్రాజెక్టు పూర్తి చేయడం మీదనే దృష్టి పెట్టి ఉండాల్సిందని హితవు పలికారు. అయితే పనిలో పనిగా.. పోలవరం విషయంలో కేంద్రం పునరాలోచిస్తున్నదని.. వారంలోగా ఒక నిర్ణయం వెలువడుతుందని కూడా సుజనా చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

పోలవరం పేరుకు జాతీయ ప్రాజెక్టే అయినప్పటికీ.. కేంద్రం సవ్యంగా నిధులు విడుదల చేయడం లేదు. పట్టించుకోవడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో నెమ్మదిగా కేంద్రం ఆ ప్రాజెక్టునుంచి తప్పించుకునే ఆలోచన చేస్తున్నదని కూడా అనుమానాలున్నాయి.

సుజనా తన మాటలతో ముందుగా అలాంటి సంకేతాలు ప్రజల్లోకి పంపి.. ఆ స్పందనను తిరిగి మోడీ సర్కారుకు నివేదించేందుకు ఇలా మాట్లాడుతున్నారా అనిపిస్తోంది. కేంద్రం పోలవరం విషయంలో ఏం ఆలోచిస్తోందో.. ఏం ప్రకటిస్తుందో.. తెలుగు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సుజనాకు ఉంది. లేకపోతే.. ప్రజలను వంచించడానికి భాజపా మరోమారు సిద్ధపడుతున్నట్లు అంతా అనుమానించాల్సి ఉంటుంది.

సుజనా.. మోడీ ఏజెంటులా మాట్లాడుతున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share