ఆయన విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్..మరి అఖిలప్రియ ఏం చేస్తదో!

ఉప ఎన్నిక‌ల వేళ నంద్యాల టీడీపీలో ర‌గ‌డ ర‌గ‌డ జ‌రుగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ వీడ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. శిల్పా వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో ఆయ‌న సోద‌రుడు ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు అయిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ్లిపోతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా చ‌క్ర‌పాణిరెడ్డి మాత్రం తాను టీడీపీని వీడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

చ‌క్ర‌పాణిరెడ్డి తాను టీడీపీని వీడ‌న‌ని ప‌దే ప‌దే చెపుతున్నా ఆయ‌న్ను మాత్రం మంత్రి అఖిల‌ప్రియ అస్స‌లు న‌మ్మ‌డం లేదు. ఆయ‌న్ను త‌మ వెంట తిప్పుకుంటే టీడీపీలోనే ఉంటూ వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న త‌న అన్న మోహ‌న్‌రెడ్డికి కోవ‌ర్టుగా ప‌ని చేస్తార‌ని అఖిల గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో పాటు ప్ర‌చారానికి సైతం దూరం పెట్టేస్తున్నారు.

చ‌క్ర‌పాణిరెడ్డి వెర్ష‌న్ మాత్రం వేరేలా ఉంది. త‌న‌కు చంద్ర‌బాబు రెండు సార్లు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చార‌ని, అందుకు కృత‌జ్ఞ‌త‌తో తాను టీడీపీ వీడ‌న‌ని, టీడీపీలోనే ఉంటాన‌ని చెపుతున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి కృషి చేస్తానని చెబుతున్నారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి తాను ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కూడా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఇక చ‌క్ర‌పాణిరెడ్డిని అఖిల‌ప్రియ దూరం పెట్టిన విష‌యాన్ని ఆయ‌న జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులకు చెప్పార‌ట‌. దీనిపై కాల్వ ఉప ఎన్నిక ప్రచారంలో చక్రపాణి రెడ్డి పాల్గొంటే నష్టమేమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా నంద్యాల‌లో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న చ‌క్ర‌పాణిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీలోనే డ‌మ్మీ అయ్యారు. ఇక ఎన్నిక‌ల వేళ ఆయ‌న ఏం చేస్తార‌న్న‌ది ? మాత్రం కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది.