బీజేపీలో టీడీపీ విలీనం.. జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

July 11, 2019 at 11:52 am

రాజ‌కీయ నాయ‌కులు హద్దులు మీరుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. అనే మాట‌లు త‌ర‌చుగా వింటూ ఉంటాం. అయితే, తాజాగా అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కూడా ఇలానే మాట‌లు జారారు. అవి అలాంటి, ఇలాంటి మాట‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు. నేరుగా ఆయ‌న కూర్చున్న కొమ్మ‌నే తెగ‌న‌రుక్కునేలా చేసిన వ్యాఖ్య‌లు. ఇప్ప‌టికే ఒక ప‌క్క ఓట‌మి, మ‌రోప‌క్క నాయ‌కుల జంపింగ్‌తో తీవ్రత‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో స‌త‌మ‌తంఅవుతున్న టీడీపీకి మ‌రింత త‌ల‌నొప్పి తెప్పించే వ్యాఖ్య‌లే చేశారు. దీంతో రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ప్రారంభమైంది.

ఇంత‌కీ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఏమ‌న్నారంటే.. త్వరలోనే తమ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని షాకింగ్ కామెంట్లు కుమ్మరించారు. “మేమే మళ్లీ బీజేపీతో తాళి కట్టించుకుంటాం“ “బీజేపీతోనే కాపురం చేస్తాం“అని వ్యాఖ్యానించారు. బీజేపీ-టీడీపీల మధ్య సంబంధాన్ని వైవాహిక బంధంతో పోల్చిన ప్రభాకర్‌రెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, ప్రస్తుతం చంద్రబాబు ఐడియాలు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీకి చాలా అవసరమంటూ వ్యాఖ్యానించారు.

ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా రాష్ట్రంలో దుమారం రేపింది. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకుకీల‌క‌మైన నాయ‌కులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ వంటి వారు బీజేపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో టీడీపీని బ‌ల‌హీన ప‌రిచేందుకు కేంద్రంలో భారీ ఎత్తున ప‌క్కా వ్యూహం అమ‌లవుతోంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే, ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అంత‌ర్గ‌త‌మా? లేక ఉద్దేశ పూర్వ‌కంగానే చేశారా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న జేసీ వంటి వారు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో వీరి వ్యూహం చాలా వెరైటీగా ఉంటుంద‌ని అనుకుంటున్నారు.

తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జేసీ కుటుంబం నుంచి ఇద్ద‌రు వార‌సులు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో జేసీ వార‌సులు ఇద్ద‌రూ కూడా పార్టీ మార్పు కోరుతున్నార‌నే ప్ర‌చారం అనంత‌పురంలో జ‌రుగుతోంది. దీనిపై చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జేసీ సోదరులు కూడా బీజేపీలోకి వెళ్తున్నారంటూ వార్తలొచ్చాయి. బ‌హుశ దీనిని స‌మ‌ర్ధించుకునేందుకు జేసీ వ్యూహాత్మ‌కంగా ఇలా ఏకంగా టీడీపీనే బీజేపీలో విలీనం అవుతోంద‌ని వ్యాఖ్యానించారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఏది నిజ‌మో తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.

బీజేపీలో టీడీపీ విలీనం.. జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share