టీడీపీలో నంద‌మూరి వ‌ర్సెస్ నారా యుద్ధం

June 15, 2019 at 1:17 pm

ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీ భవిష్యత్తుపై ఇప్పుడు లెక్కలేనన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. చంద్రబాబుకు వయసు పైబడటంతో తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నడిపించే రథసారథి ఎవరు ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘోరమైన ఓటమితో టిడిపి కార్యకర్తలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. కనీసం వాళ్ళని ఉత్తేజ పరిచేందుకు కూడా చంద్రబాబు ఉత్సాహంతో ఉన్నట్టు కనబడటంలేదు. ఓడిపోయిన నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఎలా షాకిచ్చి ఏ పార్టీలోకి వెళతారో తెలియటం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే పార్టీ నుంచి గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీ మారిపోతార‌న్న‌ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీరిని కాపాడుకోవడం కూడా చంద్రబాబు పెద్ద సవాలుగా ఉంది.

పార్టీని బతికించుకోవాలంటే ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు నారా ఫ్యామిలీ నుంచి నందమూరి ప్యామిలీకి అప్పగించాలన్న‌ డిమాండ్లు ఎక్కువగా తెర మీదకు వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగి ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్న నేతలు సైతం నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ నుంచి అసెంబ్లీలో బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ ఓడిపోయిన కార్యకర్తలకు తాము తోడుగా ఉంటామన్న‌ భరోసా బాలయ్య కలిగిస్తున్నారు. అయితే బాలయ్యకు పార్టీని నడిపించే సత్తా ఉందా ? అంటే చాలా అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ఆయన ఇంకా సినిమాల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు.

వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మనస్పూర్తిగా పని చేయలేదు. ఇప్పుడు వీరంతా ఇదే పరిస్థితి కొనసాగితే…. వచ్చే ఎన్నికల్లో నేను నారా ఫ్యామిలీ చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉంటే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని తెగేసి చెబుతున్నారు. చాలా మంది జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయ‌న గ‌తంలో 2009లోనే పార్టీ కోసం ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, బాల‌య్య జూనియ‌ర్‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టారు.

ఇప్పుడు లోకేస్ స‌త్తా ఏంటో ? అంద‌రికి అర్థ‌మైంది. క‌నీసం తొలి ప్ర‌య‌త్నంలోనే ఎమ్మెల్యేగా గెల‌వ‌లేని వాడు ? రేపు పార్టీని ముందుకు ఎలా న‌డిపిస్తాడు ? కార్య‌క‌ర్త‌ల్లో ఎలా న‌మ్మ‌కం క‌లిగిస్తాడు ? ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు ? అన్న అనుమానాలే టీడీపీ కేడ‌ర్‌కే ఉన్నాయి. ఏదేమైనా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు మాత్రం నారా, నంద‌మూరి అభిమానులుగా చీలిపోయారు. ఈ ప‌రిస్థితి వ‌చ్చే రెండు, మూడేళ్ల‌లో మ‌రింత తీవ్రం కానుంది.

టీడీపీలో నంద‌మూరి వ‌ర్సెస్ నారా యుద్ధం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share