టీడీపీ నేత సంచ‌ల‌నం..బీజేపీలోకి జంప్‌

June 13, 2019 at 2:46 pm

ఏపీ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా తెలుగుదేశం పార్టీలో ఓ బిగ్ బాంబ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కొందరు కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లి పోతారు అన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. కేశినేని నాని వ్యవహారశైలిపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే టిడిపికి రాజీనామా చేసిన ఓ కీలక నేత ఇప్పుడు తమ పార్టీ నుంచి కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు బిజెపిలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

టీడీపీ-టీఎస్‌ ప్రధాన కార్యదర్శి లంకల దీపక్‌రెడ్డి పార్టీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్నా సరైన గుర్తింపు లభించలేదని త‌న రాజీనామా సంద‌ర్భంగా ఆయ‌న వాపోయారు. తాను ఒక్క‌డినే కాద‌ని.. త‌న‌తో పాటు చాలా మంది కీల‌క నేత‌లు కూడా త్వ‌ర‌లోనే పార్టీకి రాజీనామా చేయ‌నున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. పార్టీకి రాజీనామా చేసిన దీప‌క్‌రెడ్డి పైగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌భ‌వ‌న్లో విలేక‌ర్ల స‌మావేశం పెట్ట‌డం విశేషం.

దీప‌క్‌రెడ్డి టీడీపీలో ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ సీటు కోసం విఫ‌ల‌ప్ర‌య‌త్నం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు ఖైర‌తాబాద్ సీటు వ‌స్తుంద‌ని ఆయ‌న చివ‌రి వ‌ర‌కు ఆశించినా చంద్ర‌బాబు మొండి చేయి చూపించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే దీప‌క్‌రెడ్డి కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. తనతో పాటు ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఏపీలో టీడీపీకి కనుచూపు మేరలో కూడా భవిష్యత్ లేదని భావిస్తున్న సీనియర్లు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో పలువురు కీలక నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు టీడీపీలో ఉంటే తమపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న‌ నేతలంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ వీడిన దీప‌క్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు కేవలం టీడీపీలోనే కాకుండా…. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం టిడిపి నుంచి ఒక ఎంపీ తో పాటు…. ఐదారుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోకి ఎలా ? అని వెయిటింగ్ లో ఉన్న బిజెపి ఇదే అదునుగా తెలుగుదేశం నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఐదారు నెలల్లో టిడిపికి మ‌రిన్ని షాకులు త‌ప్పేలా లేవు.

టీడీపీ నేత సంచ‌ల‌నం..బీజేపీలోకి జంప్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share