టీడీపీ వెన్నుపోట్ల‌కే టీడీపీ లేడీ లీడ‌ర్ బ‌లి..!

May 14, 2019 at 10:53 am

ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా వెన్నుపోట్లు అనేవి సహజం. విపక్ష పార్టీలకు చెందిన నేతల కంటే సొంత పార్టీ నుంచే చాలామంది కుట్రలకు, వెన్నుపోట్లకు బలవుతుంటారు. తెలుగు రాజకీయాల్లో 1985 నుంచి వెన్నుపోటు రాజకీయాలు కామన్ అయిపోయాయి. సొంత పార్టీ నేతలను సొంత పార్టీ వాళ్లే ఓడించే సంస్కృతి ఇక్కడ ఎక్కువైంది. క్రమశిక్షణకు కేరాఫ్‌గా ఉండే టీడీపీలోనూ 1999 ఎన్నికల నుంచి ఈ వెన్నుపోట్లు ఎక్కువయ్యాయి. తాజా ఎన్నికల్లోనూ టిడిపిలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ వెన్నుపోట్లు కంటిన్యూ అయ్యాయి. ఐదేళ్లలో అసెంబ్లీలో వైసీపీపై తన బలమైన వాయిస్ తో విరుచుకుపడిన ఓ లేడీ ఎమ్మెల్యే మళ్లీ గెలిపించేందుకు చంద్రబాబు వేసిన పాచిక పారడం కష్టంగానే కనిపిస్తోంది.  

అసలు విషయంలోకి వెళితే విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి గత ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీచేసి గెలిచింది వంగలపూడి అనిత. ఐదేళ్ల పాటు అనిత అసెంబ్లీలో వైసిపి ఫైర్ బ్రాండ్ రోజాను ధీటుగా ఎదుర్కొని టీడీపీ లేడి ఫైర్ బ్రాండ్ గా ప్రశంసలు అందుకుంది.  అనిత స్థానికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కొని తెచ్చుకుంది. ఎన్నికలకు ముందు ఆమె పాదయాత్ర అంటూ హడావుడి చేసిన నియోజకవర్గ టిడిపి శ్రేణులు ఆమెకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించాయి. మళ్లీ అనితకు సీటు ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని టిడిపి నాయకులు శప‌థాలు చేశారు. చంద్రబాబు అనిత అసెంబ్లీలో ఉండాలని డిసైడ్ అయ్యి ఆమెను తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసేందుకు ఇష్టం లేక… రెండు జిల్లాలు దాటించి పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపారు. 

కొవ్వూరు పేరు చెబితేనే టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1999 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ ఓడిపోయింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఇక్కడ పోటీ చేసిన  కేఎస్ జవహర్ ఆ తర్వాత ప్రక్షాళనలో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రి పదవి వచ్చాక నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలాయి. జవహర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గం ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని భారీ నిరసనలకు దిగింది. చంద్రబాబు జవ‌ర్‌ను కృష్ణా జిల్లాలోని ఆయన సొంత నియోజకవర్గం తిరువూరు నుంచి పోటీ చేయించి… పాయకరావుపేటలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వంగలపూడి అనిత కొవ్వూరు నుంచి రంగంలోకి దింపారు. పొరుగు జిల్లాల నుంచి వలస వచ్చిన అనితకు నియోజకవర్గంలో నాన్ లోకల్ అన్న ముద్ర వేయడంతో టిడిపిలోని కొన్ని వర్గాలు సైతం వైసిపికి ఇక్కడ పరోక్షంగా సహకరించారు. జవహర్‌కు టికెట్ ఇవ్వవద్దని చెప్పిన టీడీపీ కీలక శ్రేణులు స్థానికంగా కొందరికి టిక్కెట్ ఇవ్వాలని చేసిన సిఫార్సులను చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. 

దీంతో చిర్రెత్తుకొచ్చి నియోజవర్గ టిడిపి శ్రేణులు అన్ని అనిత‌కు కు బలంగా సపోర్ట్ చేయలేదని తెలుస్తోంది. అటు వైసీపీ శ్రేణులు సైతం అనిత నాన్ లోకల్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, గత ఎన్నికల్లో ఓడినా మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఐదేళ్ళపాటు పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండటం, వివాద ర‌హిత‌రాలు కావడంతో ఈ సారి చాలా మంది న్యూట్ర‌ల్ జ‌నాలు సైతం పార్టీల‌కు అతీతంగా వ‌నిత వైపు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది.  ఇక్కడ జనసేన పొత్తులో భాగంగా బిఎస్పికి సీటు కేటాయించింది. దీంతో జనసేన కేడర్ బిఎస్పికి అంతగా సపోర్ట్ చేయలేదు. కొవ్వూరు నియోజకవర్గం టిడిపికి కంచుకోట అయినా ఎక్కడ కాపు, ఎస్సీల ఓట్లే డిసైడ్ ఇన్ యాక్టర్. వీరి ఓట్లు ఎవరు ఎక్కువగా పంచుకుంటే వాళ్ళే విజయం సాధిస్తారు. ఫైనల్‌గా అనిత ఓ వనిత పోరులో అనిత అనేక మైనస్‌ల‌తో ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మరి ఈ మైనస్‌లను అధిగమించి ఆమె గెలుస్తారా ? లేదా వనిత గెలుస్తారా ? అన్నది 23న తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా వారు రెండోసారి అసెంబ్లీ  మెట్లు ఎక్కినట్లు అవుతుంది.

 
టీడీపీ వెన్నుపోట్ల‌కే టీడీపీ లేడీ లీడ‌ర్ బ‌లి..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share