బీజేపీ-వైసీపీ మైండ్ గేమ్‌లో టీడీపీ విల‌విల‌

June 15, 2019 at 7:43 am

ఏపీలో టీడీపీ విల‌విలలాడుతోంది. ఇప్ప‌టికే రెండో సారి కూడా అధికారంలోకి రావాల‌ని ఆశ‌లు పెట్టుకున్న టీడీపీకి తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. గౌర‌ప్ర‌ద‌మైన స్థానాల్లోనూ ఆ పార్టీ విజ‌యం సాదించ‌లేక పోయింది. దీంతో పార్టీ ఇప్ప‌టికే చాలా న‌ష్ట‌పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త 2014 ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ. ప‌ట్టుమ‌ని ఐదేళ్ల‌లోనే అస్తిత్వాన్ని కాపాడుకునే ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది. దీనిపై ఇప్ప‌టికే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. వ‌చ్చే 2024 నాటికి పార్టీ ప‌రిస్థితి ఏంట‌నే విష‌యంపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఇదిలావుంటే, మ‌రోప‌క్క ఇప్పుడు గెలిచిన 23 మందిలో పార్టీ అధినేత చంద్రబాబు స‌హా మ‌రి కొంత మంది సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెడితే.. చాలా మంది ప‌క్క చూపులు చూస్తున్నార‌ని స‌మాచారం. దీనికితోడు గ‌డిచిన రెండేళ్ల‌లో త‌మ‌ను తీవ్రంగా ప‌రాభ‌వించిన టీడీపీని నాశ‌నం చేయాల‌ని బీజేపీ కంకణం క‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ పోరుగా మార్చాల‌ని కూడా నాయ‌కులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలోకి చేర్చుకునేందుకు క‌మ‌ల‌నాథులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ముఖ్యంగా ఎంపీల‌కు వ‌ల విసురుతున్నారు. వీరిలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఇప్ప‌టికే బీజేపీ వ‌ల‌లోచిక్కుకున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల విష‌యాన్ని కూడా బీజేపీ నాయ‌కులు సీరియ‌స్‌గానే ప‌రిశీలిస్తున్నారు. వ‌స్తే కాద‌నేది లేద‌న్న‌ట్టుగా రాష్ట్ర బీజేపీ కూడా ద్వారాలు తెరిచే ఉంచింది. ఇక‌, అధికార వైసీపీనాయ‌కుడు, సీఎం జ‌గ‌న్ కూడా ఇదే విష‌యంపై అసెంబ్లీ సాక్షిగానే త‌న వ్యూహాన్ని వెల్ల‌డించారు. దాదాపు ఐదుగురు దాకా టీడీపీ నేత‌లు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. టీడీపీ ఖాళీఅవుతుంద‌ని వెల్ల‌డించ‌డం ద్వారా టీడీపీ నేత‌ల గుండెల్లో క‌ల‌వ‌రం పుట్టించారు.

వాస్త‌వానికి పార్టీ పిరాయింపుల‌ను జ‌గ‌న్ ప్రోత్స‌హించ‌క‌పోయినా.. ఆయ‌నతో క‌లిసి న‌డిచేందుకు ఇప్ప‌టికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా స్పందించిన టీడీపీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌.. వారి పేర్లు బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌తో టీడీపీ విల‌విల‌లాడుతోంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

బీజేపీ-వైసీపీ మైండ్ గేమ్‌లో టీడీపీ విల‌విల‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share