
అధికార టీ.ఆర్.ఎస్. ఇప్పుడు బీజేపీని అనుసరిస్తుందా..? కేంధ్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరించడానికి కారణం ఏమై ఉంటుంది..? అసలు టీ ఆర్ ఎస్ ఇప్పుడు బీజేపీ ఆలోచనను ఎందుకు ఫాలో కావాలనుకుంటుంది…? అసలు టీ ఆర్ ఎస్ కు ఇప్పుడు వచ్చిన సమస్య ఏమీటి…? బీజేపీ బాటలో నడుపాల్సిన అవసరం టీ ఆర్ ఎస్ ఆధినేత కేటీఆర్‌కు, సీఎం కేసీఆర్‌కు ఎందుకు వచ్చింది…? అంటే అవును బీజేపీ వేసిన బాటలో నడువాల్సిన అవసరం టీ ఆర్ ఎస్‌కు ఏర్పడిందనే సమాధానం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. అసలు బీజేపీ నడిచిన బాట ఏంటిది…? టీ ఆర్ ఎస్ ఎంచుకున్న బాటేంటీ… అనే కదా మీ డౌట్… ఓ మారు లుక్కేద్దాం…
తెలంగాణ రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో 2018 ఎన్నికల్లో విజయదుంధుబి మోగించింది. కనివీని ఎరుగని రీతిలో విజయం సాధించిన టీ ఆర్ ఎస్ రెండోసారి అధికారం చేపట్టి విజయవంతంగా పరిపాలన చేస్తుంది. అయితే మరి ఇప్పుడు బీజేపీ బాటలో ఎందుకు నడవాల్సి వస్తుంది టీ ఆర్ ఎస్‌కు అంటే తప్పని పరిస్థితి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం సోషల్ మీడియాలో టీ ఆర్ ఎస్ పార్టీ బీజేపీని అనుసరించాలనే నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే సోషల్ మీడియాలో టీ ఆర్ ఎస్ పార్టీ ముందునుంచి చురుకుగానే ఉన్నప్పటికి అది పార్టీకి సరియైన స్ఠాయిలో బూస్టింగ్ ఇవ్వడం లేదట. అందుకే టీ ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తుందట.
అందుకే తెలంగాణలో సోషల్ మీడియాపై అధికార టీ.ఆర్.ఎస్. ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో బీజేపీ ప్రత్యేకంగా ఓ పెద్ద నెట్‌వర్క్‌నే సృష్టించింది. నిత్యం బీజేపీ కార్యక్రమాలను సోషల్ మాధ్యమాల్లో ప్రచారం చేసి ప్రజలకు చేరువ అవుతుంది. బీజేపీ రెండు సార్లు అధికారంలోకి రావడానికి మీడియా, సోషల్ మీడియాలనే ప్రధాన కారణం అనేది సత్యం. వాస్తవానికి బీజేపీకి అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి నెట్వర్క్ లేకున్నా సోషల్ మీడియా పుణ్యమాని అది ప్రవేశపెట్టిన పథకాలను, ప్రధానమంత్రి చేస్తున్న కార్యక్రమాలను క్షణక్షణం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపర్చుతున్నారు. దీంతో బీజేపీ ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పనులు గల్లీ స్థాయి వరకు ప్రచారం పొందుతున్నాయంటే అది సోషల్ మీడియా పుణ్యమే నంటే నమ్మలేని నిజం.
ఇప్పుడు బీజేపీ పార్టీ చేపట్టిన సోషల్ మీడియాను తెలంగాణలో అధికార టీ ఆర్ ఎస్ పార్టీ చేపట్టాలని టీ ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఓ భారీ ప్రణాళికను రూపొందిస్తున్నాడట. సోషల్ మీడియాలోని ప్రధాన విభాగాలైన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ వంటి వాటితో పాటుగా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తుందట. అందుకే ఇటీవల టీ ఆర్ ఎస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నంబర్‌వన్ చానల్‌గా ఎలక్ట్రానిక్ మీడియాలో వెలుగొందుతున్న టీవీ9ను తన అనుచరుడైన మైహోం రామేశ్వరరావు చేత సీఏం కేసీఆర్ కొనుగోలు చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల రామేశ్వరరావు ఆస్తులపై ఐటీ దాడుల సందర్భంగా కూడా టీవీ9 వ్యవహరం లోకం దృష్టికి వచ్చింది.
ఇక టీ ఆర్ ఎస్ పార్టీ అదినుంచి నమస్తే తెలంగాణ పేరుతో ప్రింట్ మీడియాను, టీ న్యూస్ పేరుతో టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కొన్ని న్యూస్ ఛానల్స్‌ను, కొన్ని న్యూస్ పేపర్లను అనధికారికంగా కొనుగోలు చేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల టీవీ9 కొనుగోలు వ్యవహారం కూడా అధికారం టీ ఆర్ ఎస్ పార్టీ కనుసన్నల్లో జరిగిందే అనే ప్రచారం సాగుతుంది. ఇక మీడియా పరంగా ఎలాంటి ఇబ్బంది లేని టీ ఆర్ ఎస్ పార్టీ మాత్రం సోషల్ మీడియా పరంగా కొంత మేరకు వీక్‌గానే ఉందనే ప్రచారం పార్టీలో ఉంది. అంటే పార్టీలో స్థానిక కార్యకర్తల నుంచి సీఎం వరకు అందరు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకోవాలనే ఆలోచన చేస్తుందట.
తెలంగాణలోని టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు కే టీ ఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, సీఎం కూతురు కవితతో పాటు కొందరు ముఖ్యనాయకులు సోషల్ మీడియాలో బాగా చురుకుగా ఉంటున్నారు. అయితే వీరిలాగా అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండాలనేది ప్రస్తుతం కే టీ ఆర్, కేసీఆర్ ఆలోచనట. అందుకే ప్రతి నియోజకవర్గంలో సుమారు 200 మందితో ఓ సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉందట పార్టీ. అంతే కాకుండా యువ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ఓ 200మందితో సోషల్ మీడియాలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించిందట. ఇంకా సుమన్ వంటి వారితో సోషల్ మీడియా విభాగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు త్వరలో నిర్వహిస్తుందట పార్టీ. ఈ సోషల్ మీడియా టీంతో నిత్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేయడం, పార్టీ అభివృద్ధికి పాటుపడటం కార్యక్రమాలు చేయిస్తారట.
ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా విభాగంతో ప్రతిపక్ష పార్టీలు, పార్టీ వ్యతిరేకులు సంధించే ప్రశ్నలకు, ప్రభుత్వ, పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టెలా పనిచేయిస్తారట. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సోషల్ మీడియా టీమ్‌లను ఏర్పాటు చేయడం, ఇందులో సుశిక్షితులైన వారిని ఎంపిక చేయడం, అవసరమైతే సీనియర్ జర్నలిస్టులను, కొందరు కవులు, రచయితలను, యూత్‌ను, విద్యార్థి విభాగాల నుంచి నియమించి ప్రతిపక్ష పార్టీల వ్యతిరేక ప్రచారానికి కవితాత్యకంగా, వ్యంగాలతో కూడిన కామెంట్లతో, ఛలోక్తులు విసురుతూ తెర దించాలనే ఆలోచన చేస్తుందట పార్టీ నాయకత్వం. సో సోషల్ మీడియాతోనే ఇతర పార్టీలకు చెక్ పెట్టడం వలన తెలంగాణలో టీ ఆర్ ఎస్ పార్టీని బతికించుకోవచ్చని, తదుపరి జరుగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలనే ఆలోచనలో టీ ఆర్ ఎస్ పార్టీ ఉందట. కొసమెరుపు ఏంటంటే బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా పుణ్యమానే తెలంగాణలో నాలుగు పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడంతో టీ ఆర్ ఎస్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడంతో ఇప్పడు అదే సోషల్ మీడియాను వాడుకోవాలని టీ ఆర్ ఎస్ చూస్తుందట…