టీఆర్ఎస్‌లో ప‌ట్టుకోల్పోతున్న క‌విత‌..

July 12, 2019 at 6:21 pm

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురిగానే కాదు.. తెలంగాణ జాగృతి సంస్థ‌తో త‌న‌కంటూ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నాయ‌కురాలు. త‌న‌దైన వాగ్ధాటితో పార్టీలో, ప్ర‌జ‌ల్లో మంచి నాయ‌కురాలిగా ఆద‌ర‌ణ పొందారు. ఆమె ఏ జిల్లాకు వెళ్లినా, ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లినా అపూర్వ సాగ‌తం ల‌భిస్తుంది. నిజామాబాద్ ఎంపీగా ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లు అందించారు. అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. జిల్లాలో పార్టీని తిరుగులేని శ‌క్తిగా తీర్చిదిద్దారు. పార్టీ నేత‌లంద‌రినీ ఎక‌తాటిపై న‌డిపించారు.

అయితే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు క‌నిపిస్తోంది. ఇప్పుడు ఆమె నిజామాబాద్‌కు రాక‌పోవ‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ చేతిలో క‌విత ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. ఓట‌మి త‌ర్వాత కొద్దిరోజుల‌కు జిల్లాకు వ‌చ్చిన ఆమె.. ఓడినా.. గెలిచినా.. తాను ప్ర‌జ‌ల‌తోనే ఉంటాన‌ని అన్నారు. కానీ.. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావ‌డంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో నిరూత్సాహం క‌నిపిస్తోంది. జిల్లాలో పార్టీ కార్య‌క్ర‌మాలు పెద్ద‌గా జ‌ర‌గ‌డం లేదు. నేత‌లంద‌రూ కూడా ఎవ‌రికివారుగా విడిపోయార‌నే టాక్ బలంగా వినిపిస్తోంది.

జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కూడా మిగ‌తా ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోవ‌డం లేదట‌. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాలు అంత ఉత్సాహంగా కొన‌సాడం లేద‌నే టాక్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో జిల్లా నేత‌లు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో అంత ఉత్సాహంగా పాల్గొన‌డం లేద‌ట‌. మ‌రోవైపు మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. ప‌రిస్థితులు ఇలాగే ఉంటే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

జిల్లాకు క‌విత‌క్క వ‌స్తేనే ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డుతాయ‌ని అంటున్నాయ‌ట‌. ఇదిలా ఉండ‌గా.. మున్సిప‌ల్ ఎన్నిక‌లు కూడా క‌విత‌కు ప‌రీక్ష‌గా మారుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తే.. క‌విత గ్రాఫ్ మ‌రింత‌గా ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మాజీ ఎంపీ క‌విత ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి మ‌రి.

టీఆర్ఎస్‌లో ప‌ట్టుకోల్పోతున్న క‌విత‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share