వైసీపీ, జ‌న‌సేన గుడ్ బై..!

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కొన్ని నెల‌ల వ‌ర‌కు ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు ఓ ప్ర‌ధాన అస్త్రంగా మారింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు విప‌క్ష వైసీపీతో పాటు జ‌న‌సేన తీవ్రంగా పోటీప‌డ్డాయి. హోదా అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే హోదా కావాలంటూ స‌భ‌లు, స‌మావేశాలు, ప్రెస్‌నోట్ల‌తో బాగానే హంగామా చేశారు. అంతే త‌ర్వాత ఈ అంశాన్ని అక్క‌డితో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా అంశం గ‌తించిన అంశంగా మారిపోయింది.

ఈ విష‌యాన్ని ప్యాకేజీ దెబ్బ‌తో అందరికంటే ముందుగా టీడీపీ, బీజేపీ మ‌ర్చిపోయాయి. ఆ త‌ర్వాత వైసీపీ మ‌ర్చిపోతే ప్రెస్‌నోట్ల‌తో హంగామా చేసిన జ‌న‌సేన సైతం హోదా అంశాన్ని అట‌కెక్కించేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలచే రాజీనామా సైతం చేయిస్తానని స‌వాళ్లు రువ్విన జ‌గ‌న్ ఇటీవ‌ల మోడీని క‌లిశాక యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

హోదా కోసం త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ మోడీని క‌లిశాక ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాడా ? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ మోడీని క‌లిశాక హోదా-ఎంపీలు రాజీనామా అంశంపై వారు మ‌రోవాద‌న తెస్తున్నారు. మోడీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే త‌మ ఎంపీలు సైతం రాజీనామాకు రెడీగా ఉన్నార‌న్న కొత్త కండీష‌న్ వైసీపీ పెడుతోంది.

దీనిని బ‌ట్టి చూస్తుంటే అటు టీడీపీ వాళ్ల‌కు, ఇటు వైసీపీ వాళ్ల‌కు ఏపీకి హోదా కంటే ప‌ద‌వులే ముఖ్యంగా క‌నిపిస్తోంది. హోదా కోసం మోడీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న వాళ్లు, ఇటు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయ‌డం అసాధ్య‌మే. టీడీపీ వాళ్లు ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు రారు… వైసీపీ ఎంపీలు రాజీనామా చేయ‌రు.

ఇక హోదా కోసం ట్విట్ట‌ర్ ఫైటింగ్ చేస్తోన్న ప‌వ‌న్ సైతం ఇటీవ‌ల నోరెత్త‌డం లేదు. ప‌వ‌న్ వ‌రుస సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో జ‌న‌సేన హోదా అంశాన్ని వ‌దిలేసిన‌ట్టే క‌నిపిస్తోంది. దీంతో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని అనాథ‌లా మిగిలిపోయింది.