ప్రజా వేదిక కూల్చివేయండి..వైఎస్ జగన్ ఆదేశాలు

June 24, 2019 at 12:16 pm

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు పెద్ద షాక్ త‌గ‌ల‌నుంది. ఆయ‌న త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న నివాసానికి స‌మీపంలోనే నిర్మించుకున్న ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ప్ర‌జావేదిక అంశం ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అస‌లు ఈ అక్రమ నిర్మాణం క‌డుతుంటే మీరుం ఏం చేశార‌ని ? కూడా జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌ను నిల‌దీశారు. దీంతో షాక్ అవ్వ‌డం క‌లెక్ట‌ర్ల వంతు అయ్యింది.

మ‌నం రోడ్ల మీద ఓ బ‌జ్జీలు అమ్ముకునే వ్య‌క్తి ఫుట్‌పాత్ ఆక్ర‌మిస్తేనే జ‌రిమానా వేస్తుంటాం… అలాంటిది ఏకంగా ఓ ముఖ్య‌మంత్రి ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. జ‌గ‌న్ సూటిగా వేసిన ఈ ప్ర‌శ్న‌కు అధికారులంతా ఒక్క‌సారిగా ఖంగుతిన్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ అనుమ‌తులు లేకుండా జ‌రిగే నిర్మాణాల‌కు చెక్ పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రంలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను ముందుగా ప్ర‌జావేదిక నుంచే ప్రారంభిద్దామ‌ని.. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని స్పష్టం చేశారు. బుధ‌వారం ప్ర‌జావేదిక‌ను కూల్చివేయాల‌ని కూడా జ‌గ‌న్ స్ప‌ష్టంగా సూచించారు. ఈ క్ర‌మంలోనే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జావేదిక‌ను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించార‌ని కూడా జ‌గ‌న్ ఆరోపించారు. ఇక చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వెంట‌నే ప్ర‌జావేదిక‌ను ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న‌కు కేటాయించాల‌ని జ‌గ‌న్‌కు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఇది ఆయ‌న‌కు క‌ల‌ల కోట‌గా ఉండేది. చంద్ర‌బాబు విన్న‌పాన్ని తోసిపుచ్చిన జ‌గ‌న్ ఇప్పుడు ఏకంగా దానిని కూల్చివేయాల‌ని నిర్ణ‌యించ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ వేదిక‌పై సీఆర్డీయే అధికారులు ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు నివేదిక కూడా అంద‌జేశారు. నిన్న‌టి వ‌ర‌కు అది పేరుకు మాత్ర‌మే ప్ర‌భుత్వ భ‌వ‌నంగా ఉన్నా… దానిని టీడీపీ ప‌నుల కోస‌మే ఎక్కువుగా వాడుకున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

ప్రజా వేదిక కూల్చివేయండి..వైఎస్ జగన్ ఆదేశాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share