ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం

తాను ఎవ‌రి మాట లెక్క‌చేయ‌బోన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే పార్టీలో సీనియ‌ర్ల‌కు ఆయ‌న మ‌న‌స్త‌త్వం గురించి తెలుసు క‌నుక స‌ల‌హాలు ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌బోవ‌డం లేదు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌కు కూడా జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్ట‌మైన‌దే చేస్తా` అని చెప్ప‌క‌నే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాలి, ఎవ‌రైతే బాగుంటుంద‌నే అంశాల‌పై ఇప్ప‌టికే ప్ర‌శాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వొద్ద‌ని సూచించ‌డం.. కొంత మందికి మింగుడుప‌డ‌టం లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌న్‌.. ప్రశాంత్ మాట‌ను ప‌క్క‌న‌పెట్టేశారు!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అనుస‌రించాల్సిన వ్యూహం, ప్ర‌ణాళిక‌ల‌పై సూచ‌న‌లిచ్చేందుకు.. ఇందులో ఆరితేరిన ప్ర‌శాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌! ఎప్ప‌టినుంచో దీనిపై వార్త‌లు వినిపిస్తున్నా అధికారికంగా ఇటీవ‌లే ఆయ‌న‌తో భేటీ అయి.. పార్టీ నేత‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అయితే ఇప్ప‌టికే ప్ర‌శాంత్ బృందం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి కొంత స‌మాచారం సేక‌రించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల నియోజకవర్గంలో సర్వేలు చేయించి పనితీరు బాగాలేని వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వవద్దని సూచించారని, ఆ నియోజకవర్గంలో మరో అభ్యర్థి పేరును కూడా ప్రశాంత్ టీం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో వీరిలో అల‌జ‌డి మొద‌లైంది.

అయితే వైసీపీ ఎమ్మెల్యేల టెన్ష‌న్ అంతా తీరిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందో లేదో అని వారు ప‌డిన ఆందోళ‌న అంతా అధినేత తీర్చేశారు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త మాట‌ను కూడా ఖాత‌రు చేయ‌కుండా ఎమ్మెల్యేల‌కు భ‌రోసా ఇచ్చేశారు జ‌గ‌న్‌!! ఇక్క‌డే ఒక మెలిక‌ కూడా పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని భయపడవద్దని, సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లు దక్కేలా చూస్తానని జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తానని పూర్తిస్థాయిలో హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్క‌డే కొన్ని కండీష‌న్లు కూడా పెట్టార‌ట‌. ఈ విషయంలో ప్రశాంత్ సలహా పాటించడానికి వ్యక్తిగత కారణాలున్నాయి.

పనితీరును మెరుగుపర్చుకోవాలని, నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడానికి అధికార పార్టీ నిధులను, పనులను కేటాయించకపోవడమే కారణమని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్యేల‌కు సూచించారు జ‌గ‌న్‌. ఈ రెండేళ్లు నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా నిత్యం పర్యటిస్తూ ప్రజల్లో మమేకం కావాలని షరతు పెట్టార‌ట‌. మూడేళ్లలో వైసీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్నవారిని ఎలా విస్మరిస్తారని జగన్ ఒక సీనియర్ నేత వద్ద ప్రస్తావించారట. అందుకే వారి నిబ‌ద్ద‌త గుర్తించి టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ట జ‌గ‌న్‌!