రంగంలోకి జగన్.. హ్యాపీగా వర్మ

April 29, 2019 at 11:18 am

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసినా పొలిటిక‌ల్ హీట్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే ఒక‌టో తేదీన ఏపీలో విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సినిమా విడుద‌ల‌పై మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించేందుకు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ అధినేత జ‌గ‌న్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రామ్‌గోపాల్‌వ‌ర్మ చేసిన త‌ప్పేంటి.. అంటూ ప్ర‌శ్నించారు.

“విజ‌య‌వాడ‌లో ప్రెస్‌మీట్ పెట్ట‌లేని ప‌రిస్థితుల్లో మ‌న ప్ర‌జాస్వామ్యం ఉంది. పోలీసుల‌ను బంట్రోతుల క‌న్నా హీనంగా వాడుకునే ప‌రిస్థితుల్లో మ‌న ప్ర‌జాస్వామ్యం ఉంది. ఇదా ప్ర‌జాస్వామ్యం.. చంద్ర‌బాబుగారూ..! ఇంత‌కీ వ‌ర్మ చేసిన త‌ప్పేంటి..? అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. అయితే.. ఇక్క‌డే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. పోలీసులు అడ్డుకోవ‌డానికి వ‌ర్మ‌నే కార‌ణ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ప్రెస్‌మీట్ పెట్టుకోవ‌డంలో త‌ప్పేంలేదుకానీ.. ఆయ‌న క్రియేట్ చేసిన హైప్‌వ‌ల్లే అడ్డుకున్నార‌ని ప‌లువురు అంటున్నారు.

నిజానికి.. వ‌ర్మ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా నోవాటెల్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఉంటే ఈ లొల్లే ఉండేది కాద‌ని, ఆయ‌నే కావాల‌ని వేదిక‌లు మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. నోవాటెల్ హోట‌ల్‌ తర్వాత దాన్ని హోటల్‌ ఐలాపురానికి మార్చారు. ఆ త‌ర్వాత‌ కొద్దిసేపటికే అజిత్‌సింగ్‌నగర్‌లోని పైపులరోడ్డు జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాన‌ని రాంగోపాల్‌వ‌ర్మ ప్ర‌క‌టించారు. దీంతో వెంట‌నే పోలీసులు అప్ర‌మ‌త్తం కావ‌డం.. ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌, చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డిని అడ్డుకోవ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి.

తిరిగి వారిని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో వ‌దిలేశారు. అయితే.. ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ వివాదాస్ప‌ద సినిమా విడుద‌ల‌పై బ‌హిరంగంగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్టు అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇన్ని సినిమాలు తీసిన వ‌ర్మ‌కు ఈమాత్రం తెలియ‌దా..? అంటూ ప్ర‌శ్న‌లవ‌ర్షం కురిపిస్తున్నారు.

రంగంలోకి జగన్.. హ్యాపీగా వర్మ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share