అదే జరిగితే..జ‌గ‌న్ రాంగ్ స్టెప్ వేసినట్టే!

July 23, 2019 at 12:55 pm

స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌నున్నాయా..? ఇప్పుడిప్పుడే ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకుంటుందా..? ఈ విష‌యంలో వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి రాంగ్‌స్టెప్ వేస్తున్నారా..? అంటే రాజ‌కీయ విశ్లేష‌కుల నోటి నుంచి మాత్రం ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్ష విజ‌యంతో దూకుడుమీదున్న వైసీపీ.. మున్సిప‌ల్‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని చూస్తుండ‌డంతో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అధికార‌యంత్రాంగం అంతా రెడీ చేసిన త‌ర్వాత‌.. మంత్రుల మాట‌ల‌బ‌ట్టి చూస్తే.. ఇప్ప‌ట్లో నిర్వ‌హించ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.

నిజానికి.. అసెంబ్లీ ఎన్నిక‌ల విజ‌యోత్సాహంతో అధికార వైసీపీ మున్సిప‌ల్‌, ప‌రిష‌త్‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించి, అదే ఊపును కొన‌సాగిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక ప్ర‌తిప‌క్ష టీడీపీ కూడా అదే అనుకుంటోంది. కానీ.. అంద‌రి ఊహాగానాల‌కు భిన్నంగా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఇప్పుడిప్పుడే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌వ‌ద్ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కే మంత్రుల నోటి నుంచి ఆ సంకేతాలు వ‌స్తున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. అంటే.. మ‌రికొంత‌కాలం ప్ర‌త్యేక అధికారుల పాల‌న కొన‌సాగ‌డం త‌ప్ప‌ద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. ఈ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం జ‌గ‌న్‌కు క‌లిసి వ‌స్తుందా..? లేక న‌ష్టం చేస్తుందా..? అన్న‌దానిపై కూడా చ‌ర్చ‌మొద‌లైంది.

సాధార‌ణంగా.. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీనే మున్సిప‌ల్‌, ప‌రిష‌త్, స్థానిక సంస్థ‌ల్లో ఎక్కువ‌గా విజ‌యం సాధించే అవ‌కాశాలు మెండుగా ఉంటాయి. 2014 ఎన్నిక‌ల్లో కూడా ఇదే జ‌రిగింది. కానీ.. ప్ర‌స్తుతం.. ఆయా పాల‌క‌వ‌ర్గాల ఐదేళ్ల‌కాల‌ప‌రిమితి ముగిసింది. అధికార యంత్రాంగం ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేన‌ట్టేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అక్టోబ‌ర్‌లో రైతు భ‌రోసా.., జ‌న‌వ‌రిలో అమ్మ ఒడి ప‌థ‌కాల చెక్కులు అందించిన త‌ర్వాత ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కానీ.. ఈ నిర్ణ‌యంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాంగ్ స్టెప్ వేస్తున్నార‌నే టాక్ వినిస్తోంది. మ‌రో ఐదారు నెల‌లు ప్ర‌త్యేక అధికారుల పాల‌న కొన‌సాగితే.. ప‌థ‌కాల అమ‌లులో, అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంలో తీవ్ర ఆటంకం ఏర్ప‌డి.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని ఊహిస్తున్నారు. జ‌నంలో మంచి ఆద‌ర‌ణ ఉన్న‌ప్పుడే.. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. మున్సిప‌ల్‌, పరిష‌త్‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించి, అభివృద్ధి, ప‌థ‌కాల అమ‌లును ప‌క‌డ్బందీగా చేప‌ట్టే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.

అదే జరిగితే..జ‌గ‌న్ రాంగ్ స్టెప్ వేసినట్టే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share