జ‌గ‌న్ రాంగ్ స్టెప్‌: ఆ సిట్టింగ్ సీటు టీడీపీదేనా..!

April 29, 2019 at 4:52 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్ రాంగ్ స్టెప్ వేశారా? గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని భావించిన ఆయ‌న ఎక్క‌డిక‌క్క‌డ జాగ్ర‌త్త లు పాటించినా.. చివ‌రి నిముషంలో ఒక‌రిద్ద‌రు గుడ్డి గుర్రాల‌కు అవ‌కాశం క‌ల్పించారా? వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా? అంటే.. తాజా విశ్లేష‌ణ‌లు, లోట‌స్ పాండ్ క‌థ‌నాలు కూడా ఔన‌నే అంటున్నాయి. ప్ర‌తి ఓటును, ప్ర‌తి సీటును కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు జ‌గ‌న్ ఎంతో శ్ర‌మించారు. ప్ర‌తి సీటులోనూ ఆచితూచి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. గెలుపు గుర్రం కాద‌ని నిర్ణ‌యించుకున్న సీటులో అభ్య‌ర్థులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఆఖ‌రుకు ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నాలు చేసినా కూడా టికెట్ ఇచ్చేందుకు క‌నిక‌రం చూపించ‌లేదు.

అధికారంలోకి వ‌చ్చేందుకు గెలుపు గుర్రాల‌నే ఎంచుకోవాలని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్ ఆదిశ‌గానే అడుగులు వేశారు. అయితే, అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి విశ్వేశ్వ‌ర‌రెడ్డికి టికెట్ ఇవ్వ‌డంపై ఇప్పుడు జ‌గ‌న్ తెగ ఫీల‌వుతున్నాడ‌ని అంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో రెండుసార్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఓడిన విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గంలో ఆయన ప్రభావం చూపలేకపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు.

కేశవ్ కు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కూడా ఇవ్వడంతో ఆయనే నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించారు. నియోజకవర్గ అభివృద్ధి ఘనత కూడా కేశవ్ తన ఖాతాలోనే వేసుకున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన ఈసారి విజయం సాధించేందుకు తన శక్తియుక్తులన్నీ ప్రయోగించారు. అదేస‌మ‌యంలో కేశవ్ ను ఎదుర్కోవడంలో విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆర్థికంగా వెనుకబడిపోయారు. మొదట విశ్వేశ్వర్ రెడ్డికి చాలా రోజుల పాటు స్వంత పార్టీ నుంచే పలువురు నేతలు సహకరించకపోవడం మైనస్ గా మారింది. నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజకవర్గాలు ఇద్దరు అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. మైనారిటీలు ఎక్కువగా వైసీపీ వైపు నిలిచారనే అంచనాలు ఉన్నాయి.

అయితే, నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న బీసీలు మాత్రం తమకు అండగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉండటం, అభివృద్ధి చేయడం కలిసొచ్చిందని కేశవ్ భావిస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో విశ్వేశ్వర్ రెడ్డి కంటే కేశవ్ కు ఈసారి కొంత మొగ్గు కనిపిస్తోంది. అయితే, ఈ చావుక‌బురు జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల త‌ర్వాత కానీ తెలియలేదు. దీంతో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నార‌ని అంటున్నారు.

జ‌గ‌న్ రాంగ్ స్టెప్‌: ఆ సిట్టింగ్ సీటు టీడీపీదేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share