కోట‌గిరి, కొఠారు గెలుపుపై కోట్ల‌లో బెట్టింగులు..!

May 22, 2019 at 12:02 pm

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏపీలో ఎక్క‌డ చూసినా బెట్టింగుల‌ జోరు మామూలుగా లేదు. పల్లెల నుంచి, పట్టణాల వరకు ఇప్పుడు ఎవరి నోట విన్నా మా పార్టీ గెలుస్తుంది, మా అభ్య‌ర్థి గెలుస్తాడంటూ పందాల‌కు రెడీ అవుతున్నారు. గురువారం ఉదయం తొలి రౌండు ఫలితం వెలువడేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రమైన ఉత్కంఠను అనుభవించ‌క త‌ప్ప‌దు. ఈ 24 గంట‌లు ఎలా ? గ‌డుస్తాయా అని క్ష‌ణక్ష‌ణం ఓ యుగంగా గ‌డుపుతున్నారు. ఇక బెట్టింగుల విషయానికి వస్తే ఏపీలో వైసీపీ గెలుపుపై కోసు పందేలు కాస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు లోక్‌స‌భ సీటును ఈ సారి వైసీపీ గెలుచుకుంటుందని, ఆ పార్టీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఘన విజయం సాధించడం ఖాయమని వైసిపి వర్గాలు భారీగా పందేలు కాస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఈ ఎంపీ సీటును టిడిపి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు లక్ష ఓట్ల భారీ మెజార్టీతో గెలుచుకున్నారు. ఈ ఎన్నికల కోసం కోటగిరి శ్రీధర్ రెండున్నర సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డారు. లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీ పటిష్టతకు, కార్యకర్తల్లో తన పట్ల నమ్మకం కలిగించేలా చెయ్య‌డంలో స‌క్సెస్ అయ్యారు. యువ‌కుడు కావ‌డంతో పాటు పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో ఉండ‌డంతో ఈ సారి యువ‌త కూడా ఎక్కువ మంది కోట‌గిరి శ్రీధ‌ర్ వైపే మొగ్గు చూపారు. పోలింగ్ ముగిశాక టిడిపి, వైసీపీ శ్రేణులు ఏలూరు ఎంపీ సీటుపై గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గెలుపుపై జోరుగా బెట్టింగులు జ‌రుగుతుంటే టిడిపి ఎంపీ గెలుపు విష‌యంలో ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. చివరకు శ్రీధర్ గెలుస్తాడని ఏకంగా రూపాయికి రెండు రూపాయలు కూడా వైసిపి వాళ్ళు ఇస్తున్నారు.

ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో ఉన్న ఎంపీ సెగ్మెంట్లు అన్నింటిలోనూ శ్రీథ‌ర్ మీదే భారీ ఎత్తున బెట్టింగులు న‌డుస్తున్నాయి. విజ‌య‌వాడ ఎంపీ సీటుపై టీడీపీకి ఫేవ‌ర్‌గాను, మ‌చిలీప‌ట్నంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీల‌కు ఫేవ‌ర్‌గాను బెట్టింగులు న‌డుస్తున్నాయి. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ సీటును కూడా వైసీపీ గెలుస్తుంద‌ని చెపుతున్నా ఈ సీటుపై బెట్టింగులు కాస్త త‌క్కువ‌గానే ఉన్నాయి. టీడీపీ ముందు నుంచి గెలుస్తుంద‌ని అంద‌రూ అనుకున్న కాకినాడ ఎంపీ సీటు కూడా వైసీపీ గెలుస్తుంద‌న్న పందేలు ఫ‌లితాల‌కు రెండు రోజుల ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ ప‌రిణామం తూర్పు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగానే ఉంది.

ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పోటీ చేసిన దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తార‌ని పందేలు భారీగా న‌డుస్తున్నాయి. ఈ సీటుపై ఎన్నిక‌ల‌కు ముందు రూపాయికి రెండు రూపాయిలు ఇచ్చిన టీడీపీ వ‌ర్గాలు ఇప్పుడు స‌మంగా పందెం కాద్దామ‌ని వైసీపీ వాళ్లు క‌వ్విస్తున్నా ముందుకు రాని ప‌రిస్థితి. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మూడు మండ‌లాల్లో ఆధిక‌త్య చూపించింద‌న్న అంచ‌నాలు ఇప్పుడు చింత‌మ‌నేనితో పాటు ఆయ‌న వ‌ర్గాన్ని టెన్ష‌న్‌లో ప‌డేస్తున్నాయి. గెలుపుపై ఎప్పుడూ ధీమాతో ఉండే చింత‌మ‌నేని సైతం ఈ సారి పందేలు వ‌ద్ద‌ని త‌న అనుచ‌రుల‌కు చెపుతుండ‌డాన్ని బ‌ట్టి చూస్తే చింత‌మ‌నేనికే గెలుపు డౌట్‌లో ప‌డిందంటున్నారు.

కోట‌గిరి ల‌క్ష మెజార్టీ వ‌స్తుంద‌ని శ్రీధ‌ర్ స‌న్నిహితులు లెక్క‌లు వేస్తున్నారు. 50-60 వేల‌కు త‌గ్గ‌కుండా అయినా త‌న‌కు మెజార్టీ వ‌స్తుంద‌ని శ్రీధ‌ర్ చెపుతున్న‌ట్టు స‌మాచారం. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఒక్క దెందులూరు త‌క్కువ మెజార్టీ మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మకు మంచి మెజార్టీ వ‌స్తుంద‌ని శ్రీధ‌ర్ పూర్తి ధీమాతో ఉన్నారు. దెందులూరులో కూడా త‌క్కువ మెజార్టీతో గెలుస్తామంటున్నారు. ఇక అబ్బ‌య్య చౌద‌రి 2-4 వేల‌తో గెలుస్తార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా చివ‌రి మూడు రోజుల్లో కోట‌గిరి, కొఠారు గెలుపుపై పందేలా జోరు మామూలుగా లేదు.

కోట‌గిరి, కొఠారు గెలుపుపై కోట్ల‌లో బెట్టింగులు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share