ఆ సీటుపై వైసీపీకి, జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవ్‌…

May 20, 2019 at 10:11 am

ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎవరికి వారు కౌంటింగ్ రోజున ఎలా వ్యవహరించాలి అనే అంశంపై కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఎవరికి వారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సీట్లు ఎన్ని ? తమకు ప్రతికూల ఫలితం వచ్చే సీట్లు ఎన్ని ? అన్న లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఓ సీటుపై ఈ సారి ఆ పార్టీ ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో బాపట్ల లోక్‌స‌భ‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న జనరల్ నియోజకవర్గం అద్దంకి. రెడ్డి రాజుల రాజధానిగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో ఏడాది కాలంగా అధికార టిడిపిలో హాట్ హాట్‌గా రాజకీయాలు నడిచాయి.

వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడంతో రవికుమార్ వర్సెస్ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం మధ్య సీటు కోసం పెద్ద యుద్ధమే నడిచింది. ఈ ఎన్నికలకు ముందు టిడిపిలో ఉన్నఆమంచి కృష్ణ‌మోహ‌న్ (గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేశాడు) వైసీపీలోకి జంప్ చెయ్య‌డంతో చంద్ర‌బాబు బ‌ల‌రాంను చీరాల నుంచి రంగంలోకి దింపారు. దీంతో ఇక్క‌డ ర‌వికి పోటీ త‌ప్పిన‌ట్ల‌యింది. ఇక వైసీపీ నుంచి పార్టీ సీనియ‌ర్ నేత, గ‌తంలో టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలిచిన డాక్ట‌ర్ బాచిన చెంచు గ‌ర‌ట‌య్య రంగంలో ఉన్నారు. 1978కి ముందే స‌మ‌తి అధ్య‌క్షుడిగా ప‌ని చేసి, 1978లో జ‌న‌తా పార్టీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా పోటీ చేసి క‌ర‌ణం బ‌ల‌రాం చేతుల్లో ఓడిన గ‌ర‌ట‌య్య టీడీపీ ఆవిర్భ‌వించాక అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు.

2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్‌లో చేరి.. ఆ త‌ర్వాత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ప‌నిచేశారు. జ‌గ‌న్ చివ‌ర్లో గ‌ర‌ట‌య్య‌కు బ‌దులుగా గొట్టిపాటి ర‌వి అక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌ని ఆయ‌న‌కే సీటు ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో సీటు మిస్ అయిన గ‌ర‌ట‌య్య‌కు జ‌గ‌న్ ఈ సారి సీటు ఇచ్చారు. ఆయ‌న ఆర్థికంగా వీక్‌గా ఉండ‌డంతో పార్టీ నుంచి అన్నివిధాలా సాయం కూడా చేశారు. పాత‌త‌రం నాయ‌కుడిగా ఉన్న గ‌ర‌ట‌య్య‌కు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో యువ‌త‌రం నేత‌గా ఉన్న గొట్టిపాటి ర‌వికుమార్‌కు పోటీ ఇవ్వ‌డం క‌ష్టంగా మారింది. బ‌ల‌రాం చీరాల నుంచి పోటీ చెయ్య‌డం, చంద్ర‌బాబు జోక్యం, ర‌వికుమార్ రాజ‌కీయ చ‌తుర‌త వ్యూహంతో ఈ ఎన్నిక‌ల్లో అద్దంకిలో టీడీపీకి అనుకూలంగా వార్ వ‌న్ సైడ్ అయ్యింది.

దీనికి తోడు ఒంగోలు మాజీ ఎంపీ వైవీ. సుబ్బారెడ్డికి అద్దంకి సొంత నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించే సుబ్బారెడ్డి, ఆయ‌న సోద‌రులు ఈ సారి ప‌ట్టించుకోలేదు. ఒంగోలు ఎంపీ టిక్కెట్ వైవీకి ఇవ్వ‌క‌పోవడంతో అల‌క‌బూనిన వారంతా ఆ సారి అద్దంకిలో వైసీపీ అభ్య‌ర్థి గ‌ర‌ట‌య్య‌ను ప‌ట్టించుకోలేదు. ఇక స‌ర్వేల‌న్నీ నూటికి నూరు శాతం ర‌వికుమార్ గెలుస్తాడ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశాయి. అటు వైసీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో పాటు జ‌గ‌న్ మీడియా చేయించిన స‌ర్వేల్లోనూ ర‌వి 15 నుంచి 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. చివ‌ర‌కు జ‌గ‌న్ అనుకూల స‌ర్వేలో సైతం అద్దంకిలో వైసీపీ గెలుపుపై ఆశ‌లు వ‌దులుకోవ‌డంతో రేపు ఇక్క‌డ ర‌వి భారీ మెజారిటీతో గెలుస్తాడ‌న్న ఫ‌లితం ఇప్ప‌టికే తేలిపోయింది.

ఆ సీటుపై వైసీపీకి, జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవ్‌…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share