సీమ వైసీపీలో వీళ్లే రాజులు.. వీళ్లే మంత్రులు..!

May 18, 2019 at 12:59 pm

ప్ర‌భుత్వం ఫామ్ అవుతుందా? లేదా? అన్న‌దానితో సంబంధం లేకుండా నేను మంత్రిని అంటే.. నేనే మంత్రిని అంటూ వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల తాలూకు ఫ‌లి తం వ‌చ్చేందుకు ఇంకా ఐదు రోజుల స‌మ‌యం ఉంది. అయితే, ఫ‌లితాన్ని ముందుగానే ఊహించేసుకున్న వైసీపీ నాయ కులు జ‌గ‌న్ కేబినెట్‌లో త‌మ సీట్లు ఇవే అంటూ.. ఊహాలోకాల్లోనే క‌ర్చీఫ్‌లు ప‌రిచేశారు. వీరిలో ఆస‌క్తిక‌రంగా రాయ‌ల సీమ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉండ‌డం గ‌మ‌నార్హం. సీమ‌లోని నాలుగు జిల్లాల్లో ఒక్క అనంత‌పురంలో త‌ప్ప మిగిలిన మూడు చోట్లా వైసీపీ బ‌లంగానే ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో పార్టీకి వెన్నుద‌న్నుగా నిలుస్తున్న నాయ‌కులు మొత్తంగా కేబినెట్‌పై దృష్టి పెట్టారు.

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల్లో కీల‌క‌మైన ఆర్ కే రోజా, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, శిల్పా చ‌క్రపాణి రెడ్డి, కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, మేడా మ‌ల్లికార్జున రెడ్డి, కాపు రామ‌చంద్రారెడ్డి, గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఇలా చాలా మంది పేర్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. వీరంతా కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు, బంధువులు కూడా కావ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా రోజా పేరు ఎన్నిక‌ల అనంత‌రం నుంచే వినిపిస్తోంది. హోం శాఖ‌ను జ‌గ‌న్ రోజాకే ఇచ్చేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నాడ‌ని వైసీపీ వ‌ర్గాల నుంచే లీకులు వ‌చ్చాయి. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2004లో తొలిసారి సీఎం అయిన‌ప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ స‌బిత‌కు హోం శాఖ ఇచ్చి రికార్డు సృష్టించారు. ఇదే ప‌రంప‌ర‌ను జ‌గ‌న్ కూడా కొన‌సాగిస్తార‌ని అంద‌రూ భావించారు.

ఇక‌, కీల‌క‌మైన ఆర్థిక శాఖ‌ను బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఇస్తార‌ని ఆయ‌న అనుచ‌రులు ప్ర‌చారం చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా క‌నీసం ఏడాది కూడా ప‌నిచేయ‌కుండానే జ‌గ‌న్ పిలుపుతో ఆ ప‌ద‌వికి టీడీపీకి రాజీనామా చేసి వ‌చ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్న శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి కూడా కేబినెట్లో ఖ‌చ్చితంగా మంచి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఇక‌, సీనియ‌ర్ మోస్ట్ నేత‌, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్య‌వ‌సాయ శాఖ ఇస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి ఆయ‌న వ‌చ్చిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక‌, జ‌గ‌న్ కు మిత్రుడు గ‌డికోట‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంటున్నారు. అయ‌తే, ఇక్క‌డే చిన్న ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. సీమ‌పైనే ఇంత‌లా దృష్టి పెడితే.. మిగిలిన జిల్లాల ప‌రిస్థితి ఏంట‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు . మ‌రి జ‌గ‌న్ ఎలా స‌మ‌న్వ‌యం చేస్తాడో చూడాలి.

సీమ వైసీపీలో వీళ్లే రాజులు.. వీళ్లే మంత్రులు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share