వరమాల చల్లాకే.. దళితులకు ఇప్పుడు కాదు!

August 11, 2019 at 1:29 pm

ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరికొచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎన్నికలే. శాసనసభలో 151 సభ్యుల అపరిమితమైన బలం కలిగి ఉన్న నేపథ్యంలో.. జగన్మోహనరెడ్డి ఎవరు చెబితే వారు ఎమ్మెల్సీలు అవుతారు. అందుకే పార్టీలో చాలామంది నాయకులు ఆశలు పెంచుకున్నారు. ఆ మూడింటిలో అందులో రెండు పేర్లను జగన్ శనివారం ప్రకటించారు. ఒక పేరు పెండింగ్ లో ఉన్నప్పటికీ చల్లా రామకృష్ణారెడ్డికి దక్కినట్లే అని వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలు తెరమీదకు వచ్చినప్పటినుంచి ఒక స్థానం చుట్టూతానే ఊహాగానాలు సాగుతున్నాయి. ఒక్కటే చర్చనీయాంశం కావడం సహేతుకమే. ఎందుకంటే.. రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. దాదాపు అభ్యర్థుల ఖరారు జరిగింది. జగన్ సర్కారు ఏర్పడినప్పుడే మోపిదేవి వెంకటరమణను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఒక పేరు తేలిపోయింది. ఇఫ్తార్ విందు సమయంలో ఇక్బాల్ ఖాన్ ను ఎమ్మెల్సీ చేస్తానంటూ జగన్ ముస్లింలకు మాట ఇచ్చారు.

శనివారం నాడు ఆయన ఆ ఇద్దరి పేర్లను మాత్రమే ప్రకటించారు. ఒక్క పేరు ప్రకటన మిగిలింది. ఆ పేరు చుట్టూతానే తొలినుంచి సస్పెన్స్ నడిచింది. దానికోసం చల్లా రామకృష్ణా రెడ్డి, ఆకేపాటి అమరనాధ్ రెడ్డి, పండు రవీంద్ర బాబు, మరికొందరు దళితనాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు. మూడోస్థానాన్ని జగన్ దళితులకు ఇస్తారా, అగ్ర వర్ణాలకు కట్టబెడతారా? అనే చర్చ నడిచింది.

ప్రస్తుతం తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. మూడో స్థానం వరమాల చల్లా రామకృష్ణా రెడ్డినే వరించనుంది. దళితులకు ఎటూ తమ పార్టీ అగ్ర ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నదని, స్థానాలు పరిమితంగా ఉన్న ప్రస్తుత సమయంలో వారి కులసమీకరణలను పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని జగన్ భావించినట్లు సమాచారం. ఎమ్మెల్సీగా సభలో అడుగుపెట్టాలని కోరుకునే వైకాపా దళిత నేతలు, తమ కల తీరాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

వరమాల చల్లాకే.. దళితులకు ఇప్పుడు కాదు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share