రోజాకు మంత్రి ప‌ద‌వి ఇచ్చుంటే..అసెంబ్లీలో ఇలా జరిగేదికాదు!

July 15, 2019 at 8:59 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కేంద్రంగా రెండు రోజులుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు, దీనికి ముందు ఐదేళ్ల‌పాటు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. పొలిటిక‌ల్ గా సంచ‌ల‌నాల‌కు తెరదీశారు. వ‌రుస‌గా రెండోసారి చిత్తూరు జిల్లా న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన రోజా.. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు క్ర‌మంలోను, జ‌గ‌న్‌ను సీఎంను చేయ‌డంలోనూ అనూహ్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌విని ఆశించారు.

అయితే, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డంతో జ‌గ‌న్ ఆమెను సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఎక్కువైన నేప‌థ్యంలో ప‌క్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలోనే డిప్యూటీ సీఎంగా ఒక‌ మ‌హిళ‌కు, కీల‌క‌మైన హోంశాఖ మంత్రిగా గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి విజ యం సాధించిన సుచ‌రిత‌కు, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నుంచి విజ‌యం సాధించిన వ‌నిత‌కు అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. బ‌డ్జెట్‌పై చ‌ర్చ సాగుతోంది.

అయితే, ఈ మ‌హిళా మంత్రులు ఎవ‌రూ కూడా పార్టీ త‌ర‌ఫున కానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కానీ, ప్ర‌తిప‌క్షంపై కానీ.. పెద్ద‌గా కౌంట‌ర్లు ఇస్తున్న దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా గిరిజ‌న శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఉన్న పాముల పుష్ప శ్రీవాణి.. స‌భ‌లో టీడీపీ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు కూడా స‌రైన స‌మాధానం చెప్ప‌లేక పోయింద‌నే అప‌వాదును మూట గ‌ట్టుకున్నారు.

ఇక‌, హోం శాఖ మంత్రి సుచ‌రిత కూడా నోట్లో నాలిక లేని మ‌నిషిగా స‌భ‌లో ఎక్క‌డా స్పందించిన దాఖ‌లా క‌నిపించలేదు. మూడో మంత్రి తానేటి వ‌నిత పార్టీ ఎన్నికైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా మీడియా లో స్పందించ‌లేదు. తాను నేరుగా మీడియా స‌మావేశం కూడా పెట్ట‌లేదు. తాను ప‌నిచేసుకుంటూ.. పోతాన‌ని ప్ర‌చారానికి దూరంగా ఉంటాన‌ని చెప్పుకొచ్చా రు. అయితే, స‌భ‌లో అయినా.. ప్ర‌భుత్వం ప‌క్షాన డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు ఆమె స్పందించి ఉంటే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు.

ఇలా మొత్తంగా జ‌గ‌న్ ఎంచుకున్న మ‌హిళా మ‌ణులు మౌనం వ‌హిస్తున్నారు. క‌ట్ చేస్తే.. టీడీపీపై ఒంటికాలిపై లేచే రోజాను ప‌క్క‌న పెట్ట‌డం వ‌ల్ల స‌భ‌లో మ‌హిళా గొంతు వినిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఆమెకు అవ‌కాశం ఇచ్చి ఉంటే.. స‌భ‌లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం ల‌భించి ఉండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రోజాకు మంత్రి ప‌ద‌వి ఇచ్చుంటే..అసెంబ్లీలో ఇలా జరిగేదికాదు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share