మంత్రినంటూ ఫ్లెక్సీలు,స్టిక్ల‌ర్లు ముద్రించుకున్న వైసీపీ లీడర్

May 9, 2019 at 4:30 pm

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్నాడ‌ట ఎన‌క‌టికి ఎవ‌డో ఒక‌డు. అట్లాగే ఉంది ఏపీలోని వైసీపి పార్టీ నేత‌ల వ్య‌వ‌హారం… ఎన్నిక‌ల ఫ‌లితాలే ప్ర‌క‌టించ‌నే లేదు… అప్పుడే మా నాయ‌కుడు మంత్రి కాబోతున్నాడ‌ని ముంద‌స్తుగానే ప్ర‌చారం చేసుకుంటున్నారు.. అంతేనా ఓ అడుగు ముందుకేసి ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు త‌యారు చేసుకోవ‌డం ఓ ఎత్త‌యితే, ఏకంగా స్టిక్ల‌ర్లు ముద్రించుకుని అప్పుడే త‌మ ముచ్చ‌ట‌ను తీర్చుకుంటున్నారు. వైసిపి నేత‌ల ముందు ప్ర‌చారం చూసి ఏపీ ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏపీలో శాస‌నస‌భ ఎన్నిక‌లు గ‌త‌నెల‌లో పూర్త‌య్యాయి. ఇంకా ఫ‌లితాలు రావ‌డానికి 14రోజుల టైం ఉంది. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల తీరును చూసిన అనేక సంస్థ‌లు స‌ర్వేలు చేసి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయ‌మ‌ని చెపుతున్నాయి. దీంతో వైసీపీకి ఎలాగైనా అధికారం రావ‌డం త‌ధ్య‌మ‌ని న‌మ్మిన వైసీపీ నేత‌లు త‌మ‌కు వ‌రించ‌బోయే ప‌ద‌వుల‌ను త‌మ‌కుతామో ఊహించుకుంటూ ఊహ‌ల్లో తేలిపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లోని అనుచ‌రుల‌తో ఈ ప‌ద‌వి మ‌న‌కే వ‌స్తుంద‌ని చెపుతూ నేత‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఏకంగా కొంద‌రు నేత‌లు ఫ్లెక్సీలు, భ్యాన‌ర్లు అనుచ‌రుల చేత త‌యారు చేయించుకుంటు ముచ్చ‌ట తీర్చుకుంటున్నారు.

కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ అభ్య‌ర్థి సామినేని ఉద‌య‌భాను అనుచ‌రులు ఏకంగా కాబోయే మంత్రి అంటూ పెద్ద‌ ఎత్తున బ్యాన‌ర్లు క‌ట్టడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉద‌య‌భాను అనుచ‌రుడు జ‌గ్గ‌య్య‌పేట మున్సిపాలిటి చైర్మ‌న్ రాజ‌గోపాల్ ఆధ్వ‌ర్యంలో మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్ పంపిణి చేశారు. వాట‌ర్ బాటిల్ స్టిక్క‌ర్ల‌పై కాబోయే మంత్రి ఉద‌య‌భాను అనే స్టిక్క‌ర్లు ముద్రించి అంటించ‌డం చూసిన ఆశ్చ‌ర్య‌పోవ‌డం జ‌నం వంతైంది. ఉద‌య‌భాను అనే నేను ఏపి మంత్రిగా ప్ర‌మాణం చేసే యోగం ఉందో లేదో తెలియ‌దు కాని ముందుగానే ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఏపీ జ‌నం గుస‌గుస‌లాడుతున్నారు. ఫ‌లితాలు రావ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది… ఎవ‌రు గెలుస్తారో ఓడుతారో తెలియ‌దు… ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో అంత‌క‌న్నా తెలియ‌దు… అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికి ఎవ‌రెవ‌రికి అమాత్య‌ప‌ద‌వి వ‌రిస్తుందో అది చిదంబ‌ర ర‌హాస్యమే. కాని ఇలా ప్ర‌చారం చేసుకున్న త‌రువాత ఓ వేళ గెలువ‌క పోతే… ఒక‌వేళ ఉద‌య‌భాను గెలిచినా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుంటే… మ‌రి మ‌న ఉద‌య‌భాను ప‌రిస్థితి ఏమౌతుందో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి…

మంత్రినంటూ ఫ్లెక్సీలు,స్టిక్ల‌ర్లు ముద్రించుకున్న వైసీపీ లీడర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share