వైసీపీలో దుమారం… కీల‌క నేత‌ల మూడు ముక్క‌లాట‌!

July 11, 2019 at 11:42 am

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన శ్రీ‌కాకుళంలో ఆధికార పార్టీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తెర మీదికి వ‌స్తున్నాయి. ముఖ్యంగా జ‌గ‌న్ సునామీలోనూ టీడీపీ కైవ‌సం చేసుకున్న టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు ఎడ‌మొహం-పెడ‌మొహంగా ఉంటున్నారు. ఇక్క‌డ నుంచి గెలుపు ఆశ‌ల‌తో బ‌రిలోకి దిగిన వైసీపీ అభ్య‌ర్థి పేరాడ తిల‌క్‌ను టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అచ్చ‌న్నాయుడు ఓడించారు. దీంతో వైసీపీ ఓట‌మికి ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌నే విష‌యం ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ కీల‌క‌మైన ముగ్గురు నాయ‌కులు ఒక‌రంటే ఒక‌రు ప‌డ‌కుండా తిరుగుతున్నారు.

దీంతో పార్టీలో తీవ్ర‌మైన అఘాతం క‌నిపిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే పంచాయ‌తీ ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో పార్టీలో ఇలా అంత‌ర్గ‌త కుమ్ములాటలు ఉంటే ఎలా?. అని చ‌ర్చించుకుంటున్నారు.
విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా చేసిన‌, ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు డాక్ట‌ర్ కిల్లి కృపారాణి.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరారు. ఇక‌, అప్ప‌టికే పార్టీలో ఉన్న దువ్వాడ శ్రీ‌నివాస్‌, పేరాడ తిల‌క్‌ల‌తో క‌ల‌సి ప‌నిచేయాల‌ని పార్టీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ ఆమెకు సూచించారు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌కాకుళం వైసీపీ అధ్య‌క్షురాలుగా కిల్లి కృపారాణిని నియ‌మించారు.

మిగిలిన ఇద్ద‌రిలో దువ్వాడ‌కు శ్రీ‌కాకుళం ఎంపీ టికెట్‌ను ఇచ్చారు. పేరాడ తిల‌క్ టెక్క‌టి అసెంబ్లీ సీటును సొంతం చేసుకున్నారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఈ ముగ్గురూ క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించారు. జ‌గ‌న్‌ను గెలిపించాల‌ని, రాజ‌న్న రాజ్యం స్థాపించాల‌ని పిలుపు కూడా ఇచ్చారు. వైసీపీ మేని ఫెస్టోను కూడాబ‌లంగానే ప్ర‌జ‌ల్లోకితీసుకువెళ్లారు. అయితే జిల్లా వైసీపీలో ఉన్న గ్రూపు త‌గాదాల నేప‌థ్యంలో పేరాడ, దువ్వాడ‌లు ఇద్ద‌రూ ఓట‌మిపాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాల‌ని జ‌గ‌న్ హిత‌వు ప‌లికారు. అయితే, పార్టీ ఓట‌మి విష‌యంలో ఎవ‌రికివారే గుస్పాగా ఉన్నారు. మీ వ‌ల్లే నేను ఓడిపోయాను.. కాదు.. మీ వ‌ల్లే అంటూ.. కొన్ని రోజులుగా అనుచ‌రుల‌తో చెప్పుకొంటున్నారు.

ఇక‌, జిల్లా అధ్య‌క్షురాలిగా ఉన్న కిల్లి స‌రైన పాత్ర పోషించ‌లేక పోయార‌ని కూడా ఆరోపించారు. మెత్తంగా ఈ ప‌రిణామం.. టెక్క‌లి వైసీపీలో ఈ ముగ్గురు మ‌ధ్య అంత‌ర్గ‌త చిచ్చుకు కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే, దువ్వాడ, కిల్లి ఒక వ‌ర్గంగా ఏర్ప‌డ‌గా, పేరాడ తిల‌క్ మ‌రో వ‌ర్గంగా మారిపోయి, ఒక‌రినొక‌రు విభేదించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నెల 8 వైఎస్ జయంతిని రైతు దినోత్ప‌వంగా జ‌ర‌పాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్న‌యించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుల‌కు నేరుగా సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌కాకుళంలోనూ ఈ కార్యక్ర‌మాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

అయితే, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ఈ ముగ్గురు నాయ‌కులు కూడా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఒకే వేదిక ఎక్కినా కూడా ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకోకుండా, క‌నీసం మొహాలు కూడా చూసుకోకుండా.. త‌మ పాటిన తాము ప్ర‌సంగించి.. ఎవ‌రి దారిలో వారు వెళ్లిపోయారు. ఇక‌, ఒక స‌భ‌లో పేరాడ తిల‌క్‌ను చాలా సేపు వేదిక‌పైకి పిల‌వ‌ను కూడా పిల‌వ‌కుండా కింద ఉన్న కుర్చీల్లోనే కూర్చో బెట్టారు. ఇక, స్థానికంగా జ‌రుగుతున్న అధికారుల బదిలీలు స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల్లోనూ వీరు ఎవ‌రికి వారుగా స్పందిస్తున్నార‌ని, సిఫార‌సులు చేసుకుంటున్నార‌ని స‌మాచారం. మొత్తంగా చూసుకుంటే, ఈ ప‌రిణామం.. వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు..

వైసీపీలో దుమారం… కీల‌క నేత‌ల మూడు ముక్క‌లాట‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share