జగన్… గౌరవప్రదమైన నిష్క్రమణం!

September 7, 2018 at 2:56 pm

ప్రస్తుతం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరూ తెలంగాణ లో రాబోతున్న ముందస్తు ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని పార్టీలూ తెలంగాణ లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి తమ తమ వ్యూహరచనల్లోకి దిగుతున్నారు. వ్యాఖ్యానాలు, విమర్శలు మొదలు పెడుతున్నారు. అయితే.. ఇలాంటి కీలకమైన తరుణంలో.. తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి ఏమీ మాట్లాడకుండా పూర్తి మౌనం పాటిస్తున్నది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే.ysrcp-flag

అవును… వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు. తెలంగాణలో పరిమితంగా అయినా.. ఇంకా అక్కడక్కడా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలకు నిరుత్సాహం కలిగించే అంశమే అయినప్పటికీ.. ఇది నిజం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయ యవనిక నుంచి దాదాపుగా కనుమరుగు అయినట్లే.

జగన్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. ఆయన సంకల్పించినట్లుగా పాదయాత్ర పూర్తి కావడానికి మరో నెలరోజులకు పైగానే పట్టినా ఆశ్చర్యం లేదు. ఈలోగా మిన్ను విరిగి మీదపడినా.. జగన్ పాదయాత్రనుంచి పక్కకు చూసే ఉద్దేశంతో కూడా లేరు. ఈలోగా.. పూర్తి కాక ఎక్కే అవకాశం ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన దృష్టి పెడతారని అనుకోవడం భ్రమ. అందుకే ఈ ఎన్నికలను పట్టించుకోకుండా ఉండిపోయే అవకాశమే ఎక్కువని అనేకులు విశ్లేషిస్తున్నారు.

అధికారికంగా.. తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా .జగన్ సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటూ తెలంగాణలో పార్టీకి పెద్దగా బలం లేదు. కొన్ని ప్రాంతాల్లో కొంత మేర కార్యకర్తల బలం ఉన్నా.. సొంతంగా గెలిచేంత పరిస్థితి లేదు. ఈ సమయంలో ఏ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కూడా.. ఏపీ రాజకీయాల దృష్ట్యా సమర్థనీయం కాదు. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు.. తెలంగాణ రాజకీయాల జోలికి ఇప్పుడు వెళ్లబోయేది లేదని.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దుర్మార్గమైన పాలన నుంచి ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడడం ఒక్కటే తన ప్రథమ కర్తవ్యం అని… నినదిస్తూ జగన్ ముందుకెళితే ఆయన మైలేజీ అయినా కాస్త పెరుగుతుంది. తనకు రెండు పడవల మీద స్వారీ చేసే ఉద్దేశం లేదని.. తన శ్రద్ధ మొత్తం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ప్రకటిస్తే.. ఏపీ ప్రజలైనా దాన్ని అర్థం చేసుకుంటారు. మరోవైపు తెలంగాణలో అస్తిత్వం కోసం అనైతిక పొత్తులకు దిగజారుతున్న చంద్రబాబును ఇరుకున పెట్టినట్టు కూడా ఉంటుంది.YS-jagan-welfare-scheme

బలం లేనప్పుడు పక్కకు తప్పుకుంటే గనుక.. ఈ నిష్క్రమణం కూడా జగన్ కు గౌరవ ప్రదంగానే ఉంటుందని పలువురు అంటున్నారు.

జగన్… గౌరవప్రదమైన నిష్క్రమణం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share