కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా…

కాపులను బిసిల్లోకి చేర్చటం డిమాండ్ చేసినంత సులభమా? పోనీ కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ లిచ్చినంత మాత్రాన సాధ్యమవుతుందా? ఇపుడు ఈ ప్రశ్నలే రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పై రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటే చాలా పెద్ద ప్రహసనమే జరపాల్సి ఉంటుంది. నిర్ణయం రాష్ట్ర స్ధాయిలో తీసుకున్నా ఆమోదం కొరకు పార్లమెంట్ దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఆర్టికల్ 9కి సవరణలు చేయనిదే కాపులను బిసిల్లోకి చేర్చటం సాధ్యంకాదు. ఆర్టికల్ 9కి సవరణలు తీసుకురావాలంటే కేంద్రప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో నడుంబిగిస్తేకానీ సాధ్యం కాదు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ధక్షిణాది రాష్ట్రాల్లో అందులోనూ ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రప్రభుత్వం అంత శ్రద్ధ తీసుకుంటుందని ఎవరు అనుకోవటం లేదు.

ఇక, ప్రస్తుత సమస్యకు మూల కారణం మాత్రం నిస్సందేహంగా ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడేననటంలో ఎటువంటి సందేహం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆచరణ సాధ్యంకానీ ఎన్నో హామీలను ఇచ్చారు. అందులో కాపులను బిసిల్లోకి చేర్చటం కూడా ఒకటి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం, పొత్తుకు సినీ నటుడు,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వటం లాంటి అనేక అంశాలకు తోడు చంద్రబాబు సొంతంగా ఇచ్చిన హామీల్లో రుణమాఫీ, కాపులను బిసిల్లో చేర్చటం చాలా కీలకపాత్ర పోషించాయి. రుణమాఫీ అంశం ఏ స్ధాయిలో అమలవుతోందో ప్రభుత్వంలోని వారే స్పష్టంగా చెప్పలేరు. ఇక, కాపులను ఆరుమాసాల్లో బిసిల్లో చేర్చటమన్న హామీని కూడా చంద్రబాబు మర్చిపోయారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర దాకా ఆ విషయంపై చంద్రబాబు ఎటువంటి కార్యాచరణను చేపట్టకపోవటంతో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ విషయంపై గొంతు విప్పారు. ఆ తర్వాత పోయిన జనవరి 31వ తేదీన ఇదే విషయమై తునిలో ముద్రగడ భారీ బహి రంగ సభ జరగటం, అర్దాంతరంగా సభలోని కొందరు పక్కనే ఆగివున్న రత్నాచల్ రైలుకు, పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుండి కాపులకు రిజర్వేషన్ అంశం మంటలు పుట్టిస్తోంది. ఆ తర్వాత కూడా ముద్రగడ దీక్ష చేపట్టటం, సదరు దీక్షను ప్రభుత్వం కొందరు మంత్రులను పంపటం ద్వారా విరమింపచేయటం లాంటి ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత తాజాగా మళ్ళీ ముద్రగడ దీక్షకు కూర్చున్నారు. ఆ దీక్షను విరమింపచేయాలనుకున్న ప్రభుత్వం అందుకు సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయింది. సున్నితమైన అంశంలో పోలీసులు చేసిన ఓవర్‌యాక్షన్ వల్ల సమస్య జటిలమైపోయింది. దాంతో ఇంట్లో దీక్షకు కూర్చున్న ముద్రగడ ప్రస్తుతం ఆసుపత్రిలో ఆరురోజులుగా దీక్షను కొనసాగిస్తునారు. దాంతో ప్రభుత్వానికి ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో సతమతమవు తోంది. ఒకవైపు ప్రభుత్వ చర్చలను తప్పుపడుతు కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులందరూ ఏకతాటిపైకి రావటంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక వర్గం మొత్తం ఏకమవుతోంది. సమస్య పరిష్కారానికి సరైన మార్గం కానరాకపోవటంతో ప్రభుత్వంలో ఆందోళన పెరిగిపోతోంది.

నిజానికి కాపులను బిసిల్లోకి చేర్చటమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. అగ్రవర్ణాన్ని బిసిల్లోకి చేర్చాలంటే అందుకు ఒక కమీషన్ వేయాలి. జనాభా లెక్కలతో పాటు సామాజిక గణన ఎంతో ముఖ్యం. అవన్నీ నిర్దిష్ట రూపంలో పూర్తి చేసిన తర్వాత ఆర్టికల్ 9కి సవరణలు కోరుతూ సదరు నివేదికను కేంద్రానికి పంపాలి. అప్పుడు ఆ నివేదికను కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, అధ్యయనం చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకుని మంత్రివర్గ సమావేశం ముందుకు తెస్తుంది. మంత్రివర్గ సమావేశం ఆమోదంతో సదరు ఫైల్ సవరణలు కోరుతూ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్‌లో సవరణలు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపుతారు. ఇంత తతంగం ఉన్న వ్యవహారాన్ని చంద్రబాబు చాలా తేలిగ్గా తీసుకున్నారు. హామీనే కదా ఇచ్చేస్తే పోలా అన్న రీతిలో ఎన్నికల ముందు ఇచ్చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పక్కన బెట్టేసారు. దాంతో కాపులకు మండింది. అదుకే ముద్రగడ దీక్షలకు దిగుతున్నారు.

అయితే, వాస్తవ పరిస్దితులు మరోరకంగా ఉన్నాయి. ఆందోళనలు, దీక్షల కారణంగా ప్రభుత్వం హడావుడిగా నియమించిన మంజూనాధ కమీషన్ నివేదికను అందచేసినా సదరు నివేదికను చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి పంపాల్సిందే. ఒకవేళ పంపినా కేంద్రం ప్రస్తుత పరిస్ధితిల్లో సదరు నివేదికను ఆమోదిస్తుందన్న నమ్మకం పెద్దగా లేదు. ఎందుకంటే, ఇటీవలే ఇదే విధమైన డిమాండ్లతో గుజరాత్‌లో పటేళ్ళు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. హర్యానాలో జాట్లు, రాజస్ధాన్‌లో గుజ్జర్లు కూడా రిజర్వేషన్లు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదు. పైగా గుజరాత్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను బిసిల్లోకి చేర్చే అంశానికి అంత ప్రాధాన్యత ఇస్తుందని ఎవరూ అనుకోవటం లేదు. గతంలో పైన చెప్పిన విధానాలను పాటించకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ ప్రకటిస్తే న్యాయస్ధానం కొట్టేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా గతంలో ఒకసారి అనుమానాన్ని వ్యక్తం చేసారు. అందుకనే కాపులను బిసిల్లో చేర్చటమనే ఎన్నికల హామీ అమల్లోకి రావటం అంత ఈజీఅయితే కాదని తెలుస్తోంది.