కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్‌ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్‌ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్‌ ఆకర్ష స్టార్ట్‌ అయ్యిందంటే, దానర్థం రాజకీయ ప్రత్యర్థులందర్నీ తమ బుట్టలోకి లాగెయ్యాలనే ఉద్దేశ్యంతోనే కదా.! పైగా, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు వేరు. తెలంగాణలో తమకు ప్రత్యర్థులంటూ వుండకూడదన్నది ఆయన రాజకీయ సిద్ధాంతం.

లేకపోతే, దేశంలో ఎక్కడా లేని విధంగా, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడమేంటి.? ఏకంగా పార్టీలకు పార్టీల్నే అసెంబ్లీ సాక్షిగా విలీనం చేసేసుకోవడమేంటి.? మొత్తంగా వ్యవస్థల్ని కేసీఆర్‌ సర్వనాశనం చేసేస్తున్నారు. పైగా, దీనికి రాజకీయ శక్తుల ఏకీకరణ – బంగారు తెలంగాణ ఆవిష్కరణ.. అంటూ సన్నాయి నొక్కులొకటి. టీడీపీని దెబ్బ కొట్టడానికి కారణం, అది ఆంధ్రోళ్ళ పార్టీ. కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టడానికి రీజన్‌ ఏంటంటే టీడీపీతో కాంగ్రెస్‌ కుమ్మక్కయి, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టించాలనుకుంది కాబట్టి. ఇంకేం, బీజేపీని దెబ్బకొట్టడానికి రీజన్‌ కేసీఆర్‌ దగ్గర రెడీగానే వుండి వుండాలి. తెలంగాణకు అన్యాయం చేస్తోంది కాబట్టి, ఆ పార్టీనీ టీఆర్‌ఎస్‌లో కలిపేసుకుంటాం.. అని రేప్పొద్దున్న కేసీఆర్‌ చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు.

చివరగా మిగిలేది మజ్లిస్‌ పార్టీ. ప్రస్తుతానికి మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌కి మిత్రపక్షం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఎవరూ వుండరు. మజ్లిస్‌ విషయంలోనూ అంతే. అప్పుడెప్పుడో మజ్లిస్‌ సమైక్యవాదం విన్పించింది, రాయల తెలంగాణ.. అంటూ తెలంగాణ ప్రజల్ని వంచించింది.. సో, మజ్లిస్‌ని కూడా టీఆర్‌ఎస్‌లో కలిపేసుకుంటాం.. అని కేసీఆర్‌ నినదిస్తే, తెలంగాణలో ఆయన మాటకి ఎదురు చెప్పేదెవరు.? ఆ ఒక్క పనీ పూర్తయ్యాక.. ఆయా పార్టీల్లో ఎవరన్నా మిగిలితే ఒకర్ని చూసి ఇంకొకరు పళ్ళు ఇకిలించుకోవాల్సిందే. వారెవ్వా తెలంగాణ రాజకీయం.. అదిరిందయ్యా చంద్రశేఖరం.! ఫిరాయింపులే రాజకీయ పరమార్థం.. రాజ్యాంగాన్ని పరిహసించే విలీనమే నైతిక విలువలకు అర్థం.. అంతా కలిసి ఇదే బంగారు తెలంగాణ స్వప్నం.