బలవంతపు సర్వేలు…. రైతుల్లో కలకలం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.భైరెడ్డిపాలెంకు చెందిన బోయి గురమ్మకు సర్వే నెంబర్‌ 58లోని 1లో 4 ఎకరాలు భూముంది. ఎయిర్‌పోర్టుకు తన జిరాయితీ భూమిని ఇవ్వనని ఖరాఖండిగా చెప్పింది. అయితే అధికారులు వ్యూహాత్మకంగా గురమ్మ భూ రికార్డులు సరి చేస్తామని చెప్పి సంతకాలు చేయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తన అనుమతి లేకుండా సర్వే చేయడానికి అధికారులు రావడంతో ఆమె అవాక్కైంది.’

‘ఇదే గ్రామంలోని సరగడ ఆదిబాబు, కరగానిసూరి, భైరెడి పైడమ్మ, లక్ష్మణరెడ్డికు సర్వే నెంబర్‌ 49లో1నుంచి 15లో 6ఎకరాల భూమిని ఉంది. వీరెవరూ ఎయిర్‌పోర్టుకు భూమి ఇవ్వలేదు. కానీ వీరి భూమిలో అధికారులు సర్వే చేపడుతున్నారు.’ ఇవి మచ్చుకు మాత్రమే.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధిత రైతాంగం సర్వేలను ఆడ్డుకోవడానికి సమాయత్తమవుతోంది.

పోలీసులను ఎంతమందిని తెచ్చినా తమ అనుమతిలేకుండా పొలాల్లో అధికారులను అడుగుపెట్టనీయమని హెచ్చరిస్తున్నారు. తాజాగా భోగాపురం భూసేకరణకు ప్రభుత్వం 2004 ఎకరాలకు కుదించింది. తొలిదశగా సేకరించిన ఈ భూముల్లో భవన నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లను వేసింది. ఇందుకోసం భూసేకరణ అధికారులు పొలాల్లో బౌండరీలు ఏర్పాటు చేసేందుకు సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలు రైతులను కలవర పెడుతున్నాయి. తాము పొలమే ఇవ్వమన్నప్పుడు దాని చుట్టూ బౌండరీ వేయడం ఎంత వరకూ సబబని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పడం లేదు. మీరెన్ని చేసినా సర్వేలు చేస్తామని తహశీల్దార్‌ వంటి వారు హెచ్చరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతులు మాత్రం సర్వేలు అడ్డుకోవడానికి పెద్దఎత్తున సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం భగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది.