చేతగానితనానికి ఉద్యమాల ముసుగు!

August 10, 2019 at 3:08 pm

బందరు పోర్టు నిర్మాణం విషయంలో కాంట్రాక్టరుతో పనులు చేయించలేకపోయిన తమ చేతగానితనాన్ని తెలుగుదేశం నాయకులు అందంగా సమర్థించుకుంటున్నారు. ఏళ్లూపూళ్లూ గడుస్తున్నా కాంట్రాక్టరు అసలు పనులే చేపట్టని నేపథ్యంలో.. జగన్ సర్కారు వారి కాంట్రాక్టు ఒప్పందాన్నే రద్దు చేసేసిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనం వల్లనే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందని అందరూ భావిస్తుండగా.. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాత్రం తాము ఉద్యమాలు చేసి అయినా బందరు పోర్టును సాధించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

బందరు పోర్టు విషయంలో.. ఒప్పందాన్ని గౌరవించకుండా వేగంగా పనులు చేపట్టకుండా ఎన్ని రకాలుగా సాగదీయవచ్చో.. అన్ని రకాలుగానూ నవయుగ సంస్థ సాగతీసింది. దానికితోడు 2014లో పాలనలోకి వచ్చిన చంద్రబాబునాయుడు సర్కారు అలసత్వం కూడా తోడైంది. 2014 లో తమకు కొత్తగా గడువు ఇవ్వాలని కాంట్రాక్టరు కోరితే.. ఆ పర్మిషన్ ఇవ్వడానికే తెలుగుదేశం సర్కారుకు ఏడాది పట్టింది. 2015 సెప్టెంబరులో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు.

దాని ప్రకారం మొత్తం నాలుగేళ్లలో పని పూర్తయిపోవాలి. కాగా, ఇప్పటిదాకా పైలాన్ మినహా అసలు పనులే సక్రమంగా మొదలు కాలేదనేదే అసలు ఆందోళన. కొన్నేళ్ల కిందటే 412 ఎకరాలను లీజుకింద స్వాధీనం చేసుకుని.. ఇప్పటిదాకా.. కనీసం లీజు మొత్తం కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా.. నవయుగ సంస్థ వ్యవహారం సాగతీసింది.

నిర్మాణంలో జాప్యం జరగడం ఒక ఎత్తు . కనీసం వారికి అప్పగించిన భూమికి లీజునుకూడా వసూలు చేసుకోకుండా చంద్రబాబునాయుడు సర్కారు తమ చేతగానితనాన్ని ప్రదర్శించుకుంది. నవయుగ వారితో కొత్తగా ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా మూడున్నరేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పనులను వేగిరం చేసేలా సమీక్షించడమూ చేయకపోగా, కనీసం వారినుంచి లీజు అమౌంట్ ను కూడా రాబట్టుకోలేకపోయింది.

తెలుగుదేశం ప్రభుత్వం అంత చేతగానితనంతో వ్యవహరించినందునే ఇవాళ జగన్ సర్కారు ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందన్నది నిజం. కాకపోతే.. తెలుగుదేశం నాయకులే ఇప్పుడు డాంబికాలు పలుకుతున్నరు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తాము పోరాటాలు చేసి అయినా బందరు పోర్టును సాధిస్తాం అంటూ.. రెచ్చిపోతున్నారు. ఇలాంటి మాటల వల్ల తమ చేతగానితనమే బయటపడుతుందని ఆయన గ్రహిస్తున్నారో లేదో మరి!

చేతగానితనానికి ఉద్యమాల ముసుగు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share