ప‌వ‌న్ గారూ.. వాస్త‌వాల్ని గ‌మ‌నించండి..!

March 14, 2019 at 4:05 pm

స‌రిగ్గా దాదాపు పుష్క‌ర‌కాలం కింద‌ట సినీహీరో చిరంజీవి రాజ‌కీయ అరంగేట్రం. అభిమానుల్లో మిశ్ర‌మ స్పంద‌న‌. అన‌వ‌స‌రంగా వ‌చ్చార‌ని కొంద‌రూ, ప‌ర్వాలేదు ఓ సారి చూస్తే తెలిసిపోతుంది కాదా అని మ‌రికొందరు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి. 2009లో ప్ర‌జారాజ్యం ప్ర‌జాక్షేత్రంలోకి దిగింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మెగాస్టార్ రోడ్డుషోల‌తో ఆక‌ట్టుకున్నారు. ఎక్క‌డికెళ్లినా ఇసుకేస్తే రాల‌నంత జ‌నం. ఎన్నిక‌ల ముందు విమ‌ర్శ‌కులు కూడా ప‌ర్వాలేద‌నుకున్నారు. ఏదో కీల‌క‌మైన మార్పు జ‌ర‌గ‌బోతోంద‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాక అస‌లు రంగు తెలిసిపోయింది. స‌భ‌ల‌కు, రోడ్డు షోల‌కు వ‌చ్చిన జ‌నాలంతా త‌మ‌కే ఓటేస్తార‌నుకునే వారికి ఓట‌ర్లు క‌నువిప్పు క‌లిగించారు. ఆ త‌ర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో క‌ల‌ప‌డం, రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌వ‌డం తెలిసిన విష‌యాలే. అది అప్ర‌స్తుత‌మిక్క‌డ‌.

స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట చిరంజీవి త‌మ్ముడు ఇప్పుడు హీరో ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ పార్టీని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తాడ‌నుకుంటే ఈ ద‌ఫా టీడీపీకే మ‌ద్ద‌తంటూ ప్ర‌చార బాధ్య‌తలు నెత్తికెత్తుకుని బిజీబిజీగా గ‌డిపారు. ఎలాగోలా చంద్ర‌బాబుకు ప‌వ‌ర్ అప్ప‌గించి గ‌మ్మున ఊరుకున్నారు. అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో క‌నిపిస్తూ హడావుడి చేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఈ సారైనా ఏదైనా చేస్తాడ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో లోపాయికారీగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ట్లు అవ‌గ‌త‌మ‌వుతోంది. ఈ స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నేడు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రుగుతున్నాయి.

ఈ మ‌ధ్య కాలంలో అంటే సుమారు కొద్ది నెల‌లుగా ప‌వ‌ణ్‌క‌ళ్యాణ్ రాయ‌ల‌సీమ‌తో పాటు మ‌రికొన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. జ‌నాల‌తో క‌లిసిపోయి వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆ మ‌ధ్య ఏదో కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తే బ్రిడ్జి క‌నిపించ‌కుండా జ‌నాలు వ‌చ్చార‌ని కొన్ని మీడియాలు, ప‌త్రిక‌లు ఊద‌ర‌గొట్టాయి. ల‌క్ష‌ల్లో జ‌న‌హారం జ‌న‌సేన‌కు హార‌తి ప‌డుతున్నార‌ని పేర్కొన్నాయి.. ఇవాళ కూడా జ‌రిగే పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌కు కూడా ల‌క్ష‌ల్లో వ‌స్తే వ‌స్తారు కావ‌చ్చు. స‌రిగ్గా చిరంజీవి కాలంలో కూడా ఇలాంటి ద్రుశ్యాల‌నే చూశాం. కానీ ఒక్క‌టి మాత్రం నిజం.. నిజంగా రోడ్డు షోల‌కు, స‌మావేశాల‌కు వ‌చ్చిన వారంతా ఓట్లేస్తార‌నుకుంటే అంత‌క‌న్న మూర్ఖ‌త్వం మ‌రోటుండ‌ద‌ని గ‌తంలో చ‌రిత్ర చెప్పిన నిజాన్ని గుర్తుంచుకుంటే అంద‌రికీ మంచింది. ఈ విష‌యంలో అన్న చిరంజీవిని అడిగినా చెబుతారు. లేదంటే ఆ క్ష‌ణంలో అన్న‌య్య త‌ర‌ఫున ప్ర‌చారంలో పాల్గొన్న పవ‌నాలు సారుకు కూడా ఈ విష‌యం గుర్తుండే ఉంటుంది.

ప‌వ‌న్ గారూ.. వాస్త‌వాల్ని గ‌మ‌నించండి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share