నాలుగేళ్ల‌లో మోడీకి ద‌గ్గ‌రైందెవ‌రు.. దూర‌మైందెవ‌రు

May 26, 2018 at 12:08 pm

ఉవ్వెత్తున ఆకాశానికి ఎదిగి.. పాతాళానికి ప‌డిపోవ‌డ‌మంటే ఇదేనేమో! మిత్రులంద‌రి సాయంతో గ‌ద్దెనెక్కిన వ్య‌క్తి.. త‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తో వారంద‌రినీ దూరం చేసుకుని.. ఒంట‌రి పక్షిలా మిగిలిపోవ‌డానికి ఇంత కంటే చ‌క్క‌ని సాక్ష్యం ఉండదేమో!! నాలుగేళ్ల‌లో ఎంత మార్పు. దేశాన్ని ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న నిలుపుతాడ‌ని, అవినీతిపై శ‌మ‌ర‌శంఖం పూరించి.. ఆ మూలాలు లేకుండా చేస్తాడ‌ని.. డిజిట‌ల్ ఇండియా వైపు అడుగులు వేయిస్తాడ‌ని ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లు ఆవిర‌య్యాయి. ప్ర‌ధానిగా మోదీ ప్ర‌మాణ‌స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్త‌యింది. మ‌రి ఈ స‌మ‌యంలో ఆయ‌న చేసిన‌దేమిటి అని ఆలోచిస్తే.. త‌న నిర్ణ‌యాల‌తో మిత్రుల‌ను దూరం చేసుకో వ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చేలా చేయ‌డం. అవును. `అచ్ఛేదిన్ ఆయెగా` అంటూ నాలుగేళ్ల క్రితం చేసిన ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు.. `మోడీ స‌ర్కారు దిగిపోతే అచ్ఛేదిన్‌ వ‌స్తాయి` అంటూ విప‌క్షాలు చెబుతున్నాయి.

మోడీ.. ఒక బ‌ల‌మైన శ‌క్తి. వాగ్ధాటి గ‌ల నేత‌. మాట‌ల‌తో మాయ చేయ‌గ‌ల నేర్ప‌రి.. ఇలా ఎన్ని చెప్పుకున్నా త‌ర‌గ‌వు! నాలుగేళ్ల క్రితం దేశానికి ఒక కొత్త రాజ‌కీయ నేత కావాల‌నే ఉద్దేశంతో ప్ర‌జ‌లు మోడీని ఎంచుకున్నారు. బీజేపీకి ఎన్న‌డూ లేని విధంగా మెజారిటీని క‌ట్ట‌బెట్టారు. అంతేగాక ఆయా రాష్ట్రాల్లో మిత్ర ప‌క్షాల సాయంతో ఎన్డీఏ కూట‌మి స‌రిగ్గా నాలుగేళ్ల క్రితం ఏర్పాటు అయింది. మిత్రపక్షాలు ఇది తమ ప్రభుత్వం అని సొంతం చేసుకున్నాయి. సొంతంగా మెజారిటీ రావడంతో నరేంద్ర మోడీ-అమిత్‌షా .. ఇది తమ ప్రభుత్వం మాత్రమేననుకున్నారు. క్రమంగా మిత్రులను ఒక్కొక్కరినే దూరం చేసుకున్నారు. ఈ నాలుగేళ్లలో మోడీ సాధించిందేమిటంటే తనకుతానే ఒంటరయ్యారు. రాజకీయంగా ఒంటరి శిఖరంగా నిలబడ్డారు.

నాలుగేళ్లలో 21 రాష్ట్రాలు బీజేపీ వశమయ్యాయి. మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లోనూ నాలుగు చోట్ల అధికారం దిశగా బీజేపీ ఉరకలెత్తుతున్న దృశ్యం ఆవిష్కృతమైంది. అప్రతిహతంగా సాగుతున్న బీజేపీ విజయ పరంపరకు కర్ణాటకతో బ్రేకు పడింది. ప్రతిపక్షాల అనైక్యతే తన బలంగా సాగుతున్న కాషాయదళానికి ప్రమాద ఘంటికలు మోగాయి. కర్ణాటకలో ఎన్నికల అనంతర పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీయేతర పార్టీలు ఇక ఎన్నికల ముందు పొత్తులతో 2019 ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ.. తన పెత్తందారీ పోకడలను పక్కనబెట్టి చిన్న పార్టీలను, వ్యక్తులను ముందు నిలబెట్టి మోడీపై పోరాటం నడిపించింది. న‌డిపిస్తోంది. యూపీ, ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికల్లో విపక్షాలు కలిసికట్టుగా పోరాడి బీజేపీని మట్టి కరిపించాయి. కలిసి ఉంటేనే మోదీని గెలవగలమనే పాఠాన్ని నేర్చాయి.

కర్ణాటకలోనూ ఎన్నికల అనంతరం అదే విజ్ఞతను ప్రదర్శించి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. బద్ధ శత్రువుల నుకున్న వారు కూడా ఆలింగనాలు, కరచాలనాలు చేశారు. 1996 తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద విపక్ష ఐక్యతా ప్రదర్శన ఇదే. అప్పుడు ఎన్నికలకు ముందు ఇన్ని పార్టీలు జట్టుకట్టలేదు. ఎన్నికలు ముగిశాక అధికారం కోసం ఒక్కటయ్యాయి. ఇప్పుడు మోడీ వ్యతిరేకతే ఆలంబనగా ఎన్నికలకు చాలా ముందుగానే దోస్తీ కడుతున్నాయి.
ప్రాంతీయ పార్టీలు తామే మోడీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహిస్తామని చెబుతున్నా వాటిలో చాలావరకు కాంగ్రెస్‌ గొడుగు కిందకు చేరే అవకాశం ఉంది. ఈ పార్టీలతో డీల్‌ చేయడం రాహుల్‌ వల్ల కాదని తెలిసి సోనియాగాంధీ చొరవ తీసుకుంటున్నారు. దళితులకు చేరువ కావడానికి భారీ ప్రణాళికలతో బీజేపీ నానా తంటాలు పడుతుంటే దళిత ఐకన్‌ మాయావతిని అక్కున చేర్చుకుని కాంగ్రెస్‌ స్కోరు చేసిందని అంటున్నారు. మమతా బెనర్జీ సిద్ధాంతాన్ని విపక్షాలు తమ ప్రాబల్య రాష్ట్రాల్లో ఎంతవరకు అమలు చేస్తాయన్నది ప్రశ్న.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల తర్వాత విపక్ష కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహించే విషయం ఒక స్పష్టతకు వస్తుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడం, కఠువా, ఉన్నావ్‌ ఘటనలు దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక వాతావరణాన్ని వ్యాప్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ అవినీతిపై విరుచుకుపడతారని, దేశం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించారు. ఆశించినవి జరగకపోగా విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఘటనలు, రచయితలు, మేధావులపై దాడులు, గో సంసంరక్షణ పేరుతో మైనారిటీలు, దళితులపై దాడులు వంటివి చోటు చేసుకోవడం రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చి వేశాయి. అవే 2019 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.

నాలుగేళ్ల‌లో మోడీకి ద‌గ్గ‌రైందెవ‌రు.. దూర‌మైందెవ‌రు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share