పాక్.. అమెరికాతో సున్నం పెట్టుకుంటుందా?

August 14, 2019 at 4:42 pm

కాశ్మీరులో 370 వ అధికరణాన్ని భారత్ రద్దుచేసిన వ్యవహారంలో దుడుకు పోకడలు ప్రదర్శించడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. ఒకటిరెండు ముస్లిం దేశాలు తప్ప.. మరే దేశమూ కూడా.. పాక్ కు మద్దతుగా తమ గళం వినిపించలేదు. పైగా దుబాయి వంటి దేశాలు కూడా భారత్ వైఖరినే సమర్థించాయి. అయితే.. భారత్ పట్ల వ్యతిరేకస్వరాన్ని వినిపిస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అమెరికాతో కూడా సున్నం పెట్టుకునే వాతావరణం కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ సరిహద్దుల గుండా జమ్మూకాశ్మీర్ లోకి తీవ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తూ చెలరేగిన పాకిస్తాన్ మూకలు.. ఇప్పుడు అక్కడి పరిపాలన మొత్తం కేంద్రం ఆధీనంలోకి వచ్చేసరికి వ్యూహం మారుస్తున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో పాక్ సైనిక బలగాలను పెద్దసంఖ్యలో మోహరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా… పాకిస్తాన్ ఏం సాధించదలచుకున్నదో మనకు తెలియదు. అదే సమయంలో.. భారత సైనిక చీఫ్ మాత్రం.. పాక్ మోహరిస్తున్న బలగాల వల్ల మనం ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని ధైర్యం చెబుతున్నారు.

ఇక్కడ మరొక కీలక పరిణామాన్ని గమనించాల్సి ఉంది. అమెరికాలో ఉండే పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ ఓ కొత్త సంగతి బయటపెట్టారు. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో ఉన్న పాక్ బలగాలను సైతం, భారత్ తో సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు తరలించే అవకాశం ఉన్నదని.. ఆయన సెలవిచ్చారు. అదే జరిగితే గనుక.. పాకిస్తాన్, తెగించి అమెరికాతో సున్నం పెట్టుకున్నట్టే.

ఎందుకంటే.. ఇలాంటి చర్య వలన అమెరికా – తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలు మరింత సంక్లిష్టం అవుతాయి. పాకిస్తాన్ అంతకు సాహసించకపోవచ్చునని.. విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్రిక్తతలను పెంచడం మినహా, భారత్ తో కయ్యానికి కాలుదువ్వే ధైర్యం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు జమ్మూలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం పరిమితంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

పాక్.. అమెరికాతో సున్నం పెట్టుకుంటుందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share