టీడీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ధ‌ర్మాన‌… అచ్చెన్న‌కు క‌ళా చెక్‌..!

October 25, 2017 at 10:06 am

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఓ ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామానికి తెర‌లేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును టీడీపీలోకి తీసుకువ‌చ్చి రాజ్య‌స‌భ‌కు పంపే ప్ర‌య‌త్నాలు, చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. శ్రీకాకుళం జిల్లా టీడీపీ పేరు చెపితే ముందుగా అంద‌రికి కింజార‌పు ఎర్ర‌న్నాయుడే గుర్తుకు వ‌స్తారు. ఆయ‌న త‌ర్వాత ఇప్పుడు జిల్లాలో ఆయ‌న ఫ్యామిలీ హ‌వానే ఇప్ప‌టి వ‌ర‌కు న‌డుస్తూ వ‌స్తోంది. అయితే జిల్లాలో కింజార‌పు ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ధ‌ర్మాన‌ను టీడీపీలోకి తీసుకువ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి పార్టీ ఆవిర్భావం నుంచి ఎర్ర‌న్న ఫ్యామిలీ టీడీపీలోనే ఉంది. మ‌ధ్య‌లో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఎన్టీఆర్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోయినా ఎర్ర‌న్నాయుడు మాత్రం ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, రామ్మోహ‌న్ నాయుడు ఎంపీగా గెలిచారు. అచ్చెన్న మంత్రి అవ్వ‌డంతో జిల్లాలో తిరుగులేని హ‌వా కొన‌సాగించారు. అయితే ఆ త‌ర్వాత పార్టీలో కిమిడి క‌ళా వెంక‌ట్రావుకు మంచి ప్రాధాన్యం ల‌భించ‌డంతో అచ్చెన్న హ‌వా కాస్త త‌గ్గుతూ వ‌స్తోంది.

జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు అచ్చెన్న దూకుడుగా ముందుకు వెళుతూ వ‌స్తున్నారు. ఆయ‌న దూకుడుపై కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక క‌ళా వెంక‌ట్రావు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అవ్వ‌డం, ఈ యేడాది ఆరంభంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా రావ‌డంతో ఇప్ప‌డు జిల్లాపై ప‌ట్టు కోసం క‌ళా పావులు క‌దుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును పార్టీలోకి తీసుకువ‌చ్చి ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇప్పిస్తాన‌ని క‌ళా ప్ర‌పోజ‌ల్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

అచ్చెన్న‌కు థ్రెడ్ త‌ప్ప‌దా….

శ్రీకాకుళం జిల్లాలో బ‌లంగా ఉన్న వెల‌మ క‌మ్యూనిటీ నుంచి అటు ఎర్ర‌న్న ఫ్యామిలీతో పాటు ఇటు ధ‌ర్మాన రాజ‌కీయంగా ప్ర‌ముఖంగా ఉన్నారు. ఇప్పుడు వెల‌మ క‌మ్యూనిటికి టీడీపీ నుంచి ఎర్ర‌న్న ఫ్యామిలీ / అచ్చెన్న కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు అదే వ‌ర్గానికి చెందిన ధ‌ర్మానను టీడీపీలోకి తీసుకువ‌చ్చి రాజ్య‌స‌భ‌కు పంపితే వెల‌మ‌క‌మ్యూనిటీని ధ‌ర్మాన ఓన్ చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. అదే జ‌రిగితే మంత్రి అచ్చెన్న‌కు రాజ‌కీయంగా ఇది పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది. ఇక ఎర్ర‌న్న త‌న‌యుడు ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు లోకేష్ కోట‌రీలో కీలకంగా ఉండ‌డంతో పాటు ఇటీవ‌ల ఆయ‌న‌కు పార్టీ త‌ర‌పున అత్యున్న‌త ప‌ద‌వి ద‌క్కింది. దీంతో రామ్మోహ‌న్‌నాయుడు వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది లేక‌పోయినా మంత్రి అచ్చెన్న‌కు మాత్రం ధ‌ర్మాన ఎంట్రీ ఇస్తే పెద్ద షాకే అనుకోవాలి.

నాడు ధ‌ర్మాన అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం…

ఇక ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న‌ప్పుడు పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో చంద్ర‌బాబు ధ‌ర్మాన‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. నాడు కింజార‌పు ఎర్ర‌న్నాయుడు కూడా ధ‌ర్మాన అవినీతిపై, ఆక్ర‌మ‌ణ‌ల‌పై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఉత్త‌రాంధ్ర‌లోకి చంద్ర‌బాబు వెళితే ముందుగా ధ‌ర్మాన‌నే టార్గెట్ చేసేవారు. వీరి పోరాటాల వ‌ల్లే ధ‌ర్మాన మంత్రి ప‌ద‌వి కూడా పోయింది. ఇప్పుడు అదే ధ‌ర్మాన‌ను పార్టీలోకి తీసుకుని ఏకంగా రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇస్తే అది పార్టీ శ్రేణుల్లో వేరే సంకేతాలు వెళ‌తాయ‌న్న వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ధ‌ర్మాన టీడీపీ ఎంట్రీ వ్య‌వ‌హారం ఇప్పుడు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో చాలా ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డంతో పాటు రాజ‌కీయంగా పెద్ద దుమార‌మే రేపుతోంది.

 

టీడీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ధ‌ర్మాన‌… అచ్చెన్న‌కు క‌ళా చెక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share