ఇంకాస్త హీట్ పెంచుతున్నారు!

August 10, 2019 at 4:22 pm

తెలంగాణ విమోచన దినోత్సవం అనేది భావోద్వేగాలతో కూడుకున్న అంశం. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన పొంది భారత యూనియన్ లో విలీనం అయిన సంగతి నిజమే అయినప్పటికీ.. ఆ పేరుతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడానికి పూనుకోవడం అనేది సున్నితమైన సంగతి. అందుకే ఎప్పుడు ఎన్ని డిమాండ్లు వినిపించినా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అందుకు ముందుకు రాలేదు. ఆ అంశాన్ని పక్కన పెడుతూ వచ్చింది.

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తెలంగాణ విమోచన సభను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అప్రతిహతంగా రెండోమారు రాజ్యమేలుతోంది. ఆ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో తమ బలం పెరుగుతున్నట్లుగా భాజపా నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన సభను భాజపా పార్టీ తరఫున అయినా ఘనంగా నిర్వహించడానికి వాళ్లు నిర్ణయించారు. అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా రావడానికి ఏకంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా అంగీకరించడంతో ఇప్పుడు హీట్ పెరుగుతోంది.

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలనేది భారతీయ జనతా పార్టీ చిరకాల డిమాండు. హిందూత్వ కార్డును ఆధారం చేసుకుని తెలంగాణలో రాజకీయం చేస్తుండే భాజపా.. ఇక్కడి మెజారిటీ ముస్లిం సమాజానికి ఇష్టం ఉండదు గనుక.. ప్రతిసారీ విమోచన దినోత్సవం అనే డిమాండును వినిపిస్తుంటుంది.

ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న పార్టీ.. ఏకంగా అమిత్ షాను తీసుకువచ్చి నిజామాబాద్ లో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. తెలంగాణ విమోచన దినోత్సవం అనేదానికి ఇక్కడి ముస్లిం సమాజాన్ని తప్పుపట్టే, వారిని అనుమానించే వేడుక అన్నట్లుగా ఒక ముద్ర పడిపోయింది. నిజాంను ఓడించడం వేరు.. ముస్లిం సమాజాన్ని తప్పు పట్టడం వేరు. నిజాం- ముస్లింలు వేరువేరు అనే క్లారిటీతో ఉంటే సమస్యలేదు. అలా లేకపోవడం వల్ల ఇలాంటి వేడుక వివాదాస్పదం అవుతోంది.

ఇప్పుడు అమిత్ షా స్వయంగా రావడానికి ఒప్పుకోవడంతో.. సెప్టెంబరు 17న ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో అనే భయం ప్రజల్లో ఉంది. కేవలం ఆనాటి విజయాన్ని స్మరించుకోవడానికి మాత్రమే పరిమితమైతే ఎవరికీ ఇబ్బంది ఉండకపోవచ్చు.

ఇంకాస్త హీట్ పెంచుతున్నారు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share