తెతెదేపాపై బాబు దింపుడు కళ్లెం ఆశలు

August 11, 2019 at 2:00 pm

తెలంగాణ తెలుగుదేశం పార్టీపై చంద్రబాబునాయుడు ఇంకా దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకుని సాగుతున్నారు. పార్టీనుంచి వెళ్లిపోయేవారు.. ఇతర పార్టీల్లో ఎక్కడ ‘ద్వారములు తెరిచిఉన్నవా’ అని వెతుక్కుంటూ క్యూ కడుతున్న సమయంలో కూడా… పార్టీని ఉద్ధరించడానికి తాను పూర్తి శ్రద్ధ పెట్టేస్తానంటూ హామీ ఇస్తున్నారు. ఆయన చేస్తున్న వాగ్దానాల్ని బట్టి ఇక మీదట ప్రతి వారం తెలంగాణ పార్టీ నాయకులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటారట. ప్రతివారమూ దిశానిర్దేశం చేస్తుంటారట.
నిజానికి చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీకి ఇలాంటి వాగ్దానాలను గతంలోనూ చాలానే చేశారు. అయితే ఏ ఒక్కటీ కూడా కలకాలం నిలబడలేదు. గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన సమయంలో కూడా పార్టీలో ఆత్మస్థైర్యం నింపడానికి అన్నట్లుగా చంద్రబాబు ఇలాంటి మాటలు వల్లించారు. అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్నారు గనుక.. తెలంగాణ పార్టీని ప్రతి వారం టెలికాన్ఫరెన్సు ద్వారా ఉద్ధరిస్తానని, రాష్ట్రవ్యాప్తంగా కేడర్ తో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తానని, నెలకు ఒకసారి నేరుగా పార్టీ సమీక్ష సమావేశాలు ఉంటాయని వారికి భరోసా ఇచ్చారు.

అతి కొద్ది సందర్భాల్లో పార్టీ సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్సులు మినహా ఇంకేమీ జరగలేదు. తెలంగాణ తెదేపా సంక్షోభంలో పడిన ప్రతిసారీ.. ఇక్కడినుంచి మిగిలిన నాయకులంతా దడికట్టి, అమరావతికి వెళ్లడమూ … అక్కడ ఓ రోజంతా నిరీక్షించి, ఆయనను కలిసి పరిస్థితులను నివేదించి తిరిగి రావడమూ మాత్రమే జరుగుతూ వచ్చింది. అంతేతప్ప తె-పార్టీ కోసం ఆయన పెట్టిన శ్రద్ధ శూన్యం. ఆ పరిస్థితుల్లోనే తెలుగుదేశం రాష్ట్రంలో పూర్తిగా సర్వభ్రష్టత్వం చెందిపోయింది.

ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ ఓడిపోయింది. చంద్రబాబునాయుడు ఇదివరకటి స్థాయిలో బిజీగా లేరు. బోలెడంత ఖాళీ సమయం ఉంది. ఇలాంటప్పుడు మళ్లీ తెలంగాణ పార్టీని ఉద్ధరించే బాధ్యను ఆయన భుజానికెత్తుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ చాలా నాశనమైపోయింది. ఇప్పుడుశ్రద్ధ పెట్టినా సరే.. యాషెస్ లోంచి తిరిగి నిర్మించడమే అవుతుంది. అది చాలా కష్టం కూడా. కానీ.. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రతి వారాంతంలోనూ శని, లేదా ఆదివారాల్లో ఒకరోజు పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహిస్తా అంటున్నారు. నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తాం అంటున్నారు. అన్ని లోక్ సభ నియోజకవర్గాల పరిధికి కమిటీలు వేశాం అంటున్నారు. ప్రణాళిక చూడడానికి బాగానే ఉంది. కానీ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో ఎన్నికలు వచ్చేదాకా నిరీక్షించాలి. ఏది ఏమైనా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద ఇవన్నీ చంద్రబాబు నాయుడు దింపుడు కళ్లెం ఆశలేనని ప్రజలు అనుకుంటున్నారు.

తెతెదేపాపై బాబు దింపుడు కళ్లెం ఆశలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share