రూటు మార్చిన వైసీపీ.. ముందుగానే అవిశ్వాసం

March 15, 2018 at 3:04 pm

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు చేస్తున్న నిర‌స‌న తార‌స్థాయికి చేరింది. ఏపీకి హోదా ఇవ్వాల‌ని త‌మ ఎంపీల‌తో 21న‌ అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని, త‌ర్వాత రాజీనామా చేస్తార‌ని వైఎస్సార్ సీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే పార్ల‌మెంటు స‌మావేశాలను వీలైనంత త్వ‌ర‌గా ముగించేయాల‌ని కేంద్రం భావిస్తున్న నేప‌థ్యంలో.. వైసీపీ ఎంపీలు రూటు మార్చారు. ముందుగా నిర్ణ‌యించిన తేదీ కంటే ముందుగానే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. శుక్ర‌వార‌మే అంటే వారం రోజులు ముందుగానే అవిశ్వాసాన్ని పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అంతేగాక పార్ల‌మెంటును నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన రోజే రాజీనామాలు కూడా చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆ పార్టీ ఎంపీలు ప్ర‌క‌టించారు. 

 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్పార్ సీపీ దూకుడు పెంచింది. 15 రోజులుగా పార్లమెంట్‌లో పోరాడుతున్నా కేంద్రం ఒక్కసారి కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో వైఎస్‌ఆర్‌ సీపీ వ్యూహం మార్చింది. పార్లమెంటు సమావేశాలను ముందస్తుగానే వాయిదా వేస్తారనే సమాచారంతో మార్చి 21న కాకుండా శుక్రవారం అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను వైఎస్సార్ సీపీ ఎంపీలతో భేటీ అవుతున్నారు. బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్‌, టీడీపీ ఎంపీ తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులను కలిసిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 

మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. కాగా అంతకు ముందు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్పార్‌ సీపీ ఎంపీలు సమావేశమ‌య్యారు. పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగియనున్న నేపథ్యంలో అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని, తమ పోరాటం వల్లే చంద్రబాబు దారిలోకి వచ్చారన్నారు. 

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆందోళన ఇవాళ కూడా కొనసాగింది. గురువారం లోక్‌సభలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌ స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక రాజ్యసభలోనూ ఎంపీ విజయసాయి రెడ్డి ఆందోళన  కొనసాగించారు. 

 

రూటు మార్చిన వైసీపీ.. ముందుగానే అవిశ్వాసం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share