మొక్కే కదా అని పీకేస్తే.. 

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’. తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంటే అందరూ ఈ డైలాగ్‌ని స్మరించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశం వేరు, ఇప్పటి సందర్భం వేరు. కానీ, మొక్కలు నాటడం కాదు – వాటిని పీకకుండా పెంచగలగాలని ప్రజలు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి ఈ డైలాగ్‌ బాగా వినవస్తోంది.

గత ఏడాది నాటి మొక్కల్లో సగం కూడా బతకలేదని సాక్షాత్తూ గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. ఈ ఏడాది మొక్కల పెంపకంపై తాను సమీక్షిస్తానని గవర్నర్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ ప్రభత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోట్లాది మొక్కల్ని నాటే కార్యక్రమం ఇది. హైదరాబాద్‌లో ఎందరో సినీ ప్రముఖులు ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, పలువురు హీరోయిన్లు ఎక్కడికక్కడ మొక్కలు నాటారు.

మొక్క లేనిదే మానవ మనుగడ లేదు. మొక్క పెరిగి చెట్టుగా మారితేనే అది మానవాళికి ఉపయోగపడుతుంది. అది అలా ఉపయోగపడాలంటే మొక్క నాటడం మీదనున్న శ్రద్ధ దాన్ని పెంచడమ్మీద కూడా చూపించాలి. మొక్కలు నాటడం, ఈ హడావిడిలో అక్కడకు హాజరైన జనసందోహం వాటిని తొక్కేయడంతోనే సగం మొక్కలు చనిపోతున్నాయి. ఇది పబ్లిసిటీ కార్యక్రమంలా కాకుండా బాధ్యతలా నిర్వహించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంది.