బాలకృష్ణుడు TJ రివ్యూ

TJ రివ్యూ: బాలకృష్ణుడు

టైటిల్: బాలకృష్ణుడు

జానర్: కమర్షియల్ ఎంటర్ టైనర్

తారాగణం: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ

సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి.కుమార్‌

మ్యూజిక్‌: మణిశర్మ

నిర్మాతలు: బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి

దర్శకత్వం: పవన్ మల్లెల

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

రిలీజ్ డేట్‌: 24 న‌వంబ‌ర్‌, 2014

టాలీవుడ్‌లో బ‌ల‌మైన సినిమా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి హీరోగా వ‌చ్చిన నారా రోహిత్ వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా స‌రైన హిట్ మాత్రం రావ‌డం లేదు. రోహిత్ గ‌త కొన్ని సినిమాల్లో చూస్తే ఒక్క జ్యో అచ్యుతానంద సినిమా ఒక్క‌టి మాత్ర‌మే యావ‌రేజ్ అనిపించుకుంది. ఇక రోహిత్ గ‌త సినిమాలు చూస్తే క‌థ‌ల ఎంపిక‌లో మాత్రం చాలా కొత్త‌ద‌నం క‌నిపిస్తోంది. ఆ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలా ఉన్నా రోహిత్ ఎంచుకునే క‌థ‌ల‌కు మాత్రం మంచి మార్కులే ప‌డుతున్నాయి. అలాంటి రోహిత్ తొలిసారిగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ జాన‌ర్‌లో న‌టించాడు. బాల‌కృష్ణుడు టైటిల్‌తో ప‌వ‌న్ మ‌ల్లెల తెర‌కెక్కించిన ఈ సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి బాల‌కృష్ణుడు ఎంత వ‌ర‌కు మెప్పించాడో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

ఈ సినిమా క‌ర్నూలు జిల్లాలో ఉయ్యాల‌వాడ ప్రాతంలోని ఫ్యాక్ష‌న్ ఏరియాల్లో స్టార్ట్ అవుతుంది. ర‌వీంద‌ర్‌రెడ్డి(ఆదిత్య మీన‌న్) భానుమ‌తి (ర‌మ్య‌కృష్ణ‌) సీమ‌లో ఫ్యాక్ష‌న్ సంస్కృతికి బ్రేక్ వేయాల‌ని చూస్తారు. ర‌వీంద‌ర్‌రెడ్డికి పెరుగుతోన్న క్రేజ్ చూసిన అత‌డి ప్ర‌త్య‌ర్థి బ‌సిరెడ్డి (రామ‌రాజు) సీమ అభివృద్ధికి బ్రేక్ వేయాల‌ని చూస్తుంటాడు. సీమ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ర‌వీంద‌ర్‌రెడ్డి చేతిలో తీవ్ర అవ‌మానానికి గురైన బ‌సిరెడ్డి సూసైడ్ చేసుకుంటాడు. ఆ కోపంతో బ‌సిరెడ్డి కొడుకు ప్ర‌తాప్‌రెడ్డి (అజ‌య్‌) ర‌వీంద‌ర్‌రెడ్డిని చంపేస్తాడు. అన్న‌ను చంపార‌న్న కోపంతో భానుమ‌తి ప్ర‌తాప్‌రెడ్డి మనుషుల‌ను చంపిస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే జైలులో ఉన్న ప్ర‌తాప్‌రెడ్డి భానుమ‌తికి ప్రాణ‌మైన ఆమె మేన‌కోడ‌లు ఆద్య (రెజీనా)ను చంపేందుకు ప్లాన్ వేస్తాడు. 

ప్ర‌తాప్‌రెడ్డి మ‌నుష్యుల నుంచి త‌న మేన‌కోడ‌లు ఆద్య‌ను కాపాడుకునేందుకు భానుమ‌తి బాలు(నారా రోహిత్‌)ని బాడీగార్డ్‌గా నియ‌మిస్తుంది. తాను బాడీగార్డ్ అని చెప్ప‌కుండా బాలు. ఆద్య‌కి ద‌గ్గ‌రై ఆమెను కాపాడుతుంటాడు. ఈలోపు స‌త్ప్ర‌వ‌ర్త‌న క్రింద ప్ర‌తాప్ రెడ్డి జైలు నుండి బ‌య‌ట‌కొస్తాడు. ఆద్యను చంపాల‌ని ప్ర‌తాప్‌రెడ్డి వేసే ఎత్తుల‌ను బాలు ఎలా అడ్డుకుంటాడు ? ప‌్ర‌తాప్ రెడ్డిని బాలు ఎలా ముప్ప‌తిప్ప‌లు పెడ‌తాడు ? ఈ క్ర‌మంలోనే బాలు- ఆద్య ఎలా ఒక్క‌ట‌య్యారు ? అన్న‌దే సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ :

నారా రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త కాన్సెఫ్ట్‌తో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి రూటు మార్చి క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం రొటీన్ క‌థ‌తో సినిమా చేయాల‌నుకోవ‌డం విచిత్ర‌మే. తెలుగులో ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోలు కొత్త కాన్సెఫ్ట్‌తో సినిమాలు చేస్తుంటే రోహిత్ కాన్సెఫ్ట్ స్టోరీల నుంచి రొటీన్ స్టోరీల వైపు రావ‌డం షాకే. అయితే రొటీన్ క‌థ‌ల‌తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ చేయాల‌నుకోవ‌డంలో తప్పేలేదు. ఓ హీరోకు అది అవ‌స‌రం కూడా. అయితే అలాంటి స్టోరీ ఎంచుకునే ముందుకు దానికి త‌గిన క‌థ‌, క‌థ‌నాలు, ఎలివేట్ చేసే ద‌ర్శ‌కుడు ఉండాలి. బాల‌కృష్ణుడు సినిమాకు ఈ మూడు మైన‌స్ అయిన‌ట్టే అనుకోవాలి. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం తెలుగులో అరిగిపోయిన హిట్ ఫార్ములాను ఈ సినిమాకు ఎంచుకోవ‌డం బాధాక‌రం. హిట్ సినిమాలైన ఢీ, రెఢీ వంటి కాన్సెప్ట్ స్క్రీన్ ప్లేతో ఉన్న క‌థ‌ను ఎంచుకోవ‌డం బిగ్గెస్ట్ మిస్టేక్‌. 

రోహిత్ న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రెండు స్టెప్పుల‌తోనే రోహిత్ డ్యాన్సులు మొత్తం లాగిం చేస్తున్నాడు. ఓ పాట‌లో అయితే రోహిత్ కంటే రెజీనా, పియా బాజ్‌పాయ్‌లే స్క్రీన్ మీద ఎక్కువుగా క‌న‌ప‌డ్డారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. న‌ట‌న‌లో కూడా మెనాట‌నీ క‌న‌ప‌డుతోంది. కుర్ర‌హీరోలే కాదు, సీనియ‌ర్ హీరోలు కూడా ఫైట్స్ విష‌యంలో ఇర‌గ‌దీస్తుంటే రోహిత్ బాడీ క‌ద‌ల్చ‌కుండా చేసిన ఫైట్లు న‌వ్వు తెప్పించాయి. ఇక హీరోయిన్ రెజీనా గురించి చెప్పాలంటే న‌ట‌న కంటే అందాల అర‌బోత‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. సినిమాలో కీల‌క‌మైన రోల్‌లో భానుమ‌తిగా మెప్పించిన ర‌మ్య‌కృష్ణ రోల్ రాను రాను తేలిపోయింది. మెయిన్ విల‌న్‌గా న‌టించిన అజ‌య్ గురించి చెప్పాలంటే రొటీన్ రొట్ట‌కొట్టుడు రోల్‌. పృథ్వి కామెడీ రోల్ మాత్రం ప్రేక్ష‌కుల‌కు పెద్ద రిలీఫ్‌. 

టెక్నిక‌ల్‌గా చెప్పాలంటే మ‌ణిశ‌ర్మ పాట‌లు గుర్తే ఉండ‌వు. విజ‌య్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఇక నారా రోహిత్ ఇలాంటి క‌థ‌లో ఏముందుని ఎంచుకున్నాడో అత‌డికే తెలియాలి. రొటీన్‌కు భిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ సినిమాలు తీసే రోహిత్ క‌థ‌లో రాజ‌కుమారి, బాల‌కృష్ణుడుతో మాత్రం చెత్త క‌థ‌లు ఎంచుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ మ‌ల్లెల పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్‌తో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి చిరాకు తెప్పించాడు

బాల‌కృష్ణుడు TJ ఫైన‌ల్ పంచ్ :  నిద్ర + ఆవులింత‌లు + విసుగు

బాల‌కృష్ణుడు సినిమా TJ  సూచ‌న‌:  ప‌దేళ్ల నాటి సినిమా చూడాలా ? వ‌ద్దా ?  మీ ఇష్టం.

బాల‌కృష్ణుడు సినిమా TJ రేటింగ్ : 2 / 5