మెస్మ‌రైజ్ చేసిన నాని …జెర్సీ రివ్యూ&రేటింగ్

April 19, 2019 at 2:34 pm

చిత్రం : జెర్సీ
న‌టీన‌టులు : నాని, శ్రద్దా శ్రీనాథ్‌, సత్యరాజ్‌ తదితరులు
సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌
దర్శకత్వం : గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

నిత్యం కొత్త‌ద‌నంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ప్ర‌య‌త్నించే హీరోల్లో నాని ముందువ‌రుస‌లో ఉంటారు. న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ అటు యూత్‌లో.. ఇటు ఫ్యామిలీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నాని. అందుకే ఆయ‌న‌ నేచుర‌ల్ స్టార్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలోనే నాని మ‌రో స‌రికొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. నాని, శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జెర్సీ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్లు అంచ‌నాల‌ను పెంచేయి. నాని కూడా ఈ సినిమా పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆయ‌న అంచ‌నాలు ఏమేర‌కు నిజ‌మ‌య్యాయో చూద్దాం.

క‌థేమిటంటే..
అర్జున్‌ (నాని) భార‌త‌ క్రికెట్‌ జట్టు త‌రుపున ఆడ‌డ‌మే ల‌క్ష్యంగా సాధ‌న చేస్తుంటాడు. కానీ.. ప్ర‌తీసారి చివ‌రి క్ష‌ణంలో అవ‌కాశాన్ని కోల్పోతుంటాడు. ఈ క్ర‌మంలో నానికి 26ఏళ్ల వ‌య‌స్సులో ఆట‌ను వ‌దిలేస్తాడు. అయితే.. అప్ప‌టికే సారా(శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్‌)ను ప్రేమించిన నాని.. ఆ త‌ర్వాత ఆమెను పెళ్లి చేసుకుని హైద‌రాబాద్‌లో సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటారు. వారికి నాని అనే కుమారుడు జ‌న్మిస్తాడు. కుటుంబ పోష‌ణ కోసం ఓ ఉద్యోగంలో చేరి.. కొంత‌కాలానికి అదికూడా క‌ల్పోతాడు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్ప‌డుతాయి. ఇక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న నాని.. కుమారుడి పుట్టిన రోజున క‌నీసం గిఫ్ట్ కూడా కొనివ్వ‌లేదు. అయితే.. మ‌ళ్లీ ఎలాగైనా క్రికెట్ ఆడి.. త‌న కుమారుడి దృష్టిలో హీరోగా నిలిచిపోవాల‌ని నాని అనుకుని సాధ‌న మొద‌లు పెడుతాడు. తాను అనుకున్న ల‌క్ష్యాన్ని నాని ఎలా చేరుకున్నాడు..? ఈ క్ర‌మంలో ఎలాంటి మ‌లుపులు ఉన్నాయి..? అన్న‌వి మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

ఎలా ఉందంటే…
ఓ క్రికెట‌ర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌ధానంగా ఇన్‌స్పిరేష‌న్ కాన్సెప్ట్‌లో సాగుతుంది. నిజానికి.. హీరో మొద‌ట్లో జాలీగా తిర‌గ‌డం.. మ‌ధ్య‌లో క‌ష్టాలు.. చివ‌ర‌కు స‌క్సెస్ కావ‌డం.. ఈ లైన్‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. అయితే.. జెర్సీ సినిమా కూడా ఇదే లైన్‌లో వ‌చ్చిన‌దే. కానీ.. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ క‌థ‌ను న‌డించిన తీరు ఎంతో కొత్త‌గా ఉంటుంది. క్రికెట్ నేప‌థ్యంగా క‌థాంశం తీసుకుని దానిని తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పొచ్చు. ఈ క‌థ మొత్తం 1986-96 మ‌ధ్య కాలంలో సాగుతుంది. ప్రేక్ష‌కుల‌ను ఆ కాలానికి తీసుకెళ్ల‌డంలో గౌత‌మ్ విజ‌య‌వంతం అయ్యాడు. న్యూజిలాండ్‌- హైద‌రాబాద్ చారిటీ మ్యాచ్‌ను, ముంబాయి-హైద‌రాబాద్ మ్యాచ్‌ను ఎంతో నేచుర‌ల్‌గా తెర‌కెక్కించాడు గౌత‌మ్‌. ఇక నానికి, ఆయ‌న కుమారుడికి మ‌ధ్య వ‌చ్చే భావోద్వేగ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. అలాగే.. నాని- శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్ కూడా బాగా పండింది. అక్క‌డ‌క్క‌డ కొంచెం క‌థ నెమ్మ‌దించినా.. ఎక్క‌డ కూడా ప్రేక్ష‌కులు మాత్రం క‌థ‌లో నుంచి బ‌య‌ట‌కు రారు.

ఎవ‌రెలా చేశారంటే..
జెర్సీ సినిమాతో నాని మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. క్రికెట‌ర్‌గా నాని త‌న పాత్ర‌లో జీవించాడు. ఈ పాత్ర‌లో నాని క‌ష్టం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ ప‌ర్స‌న్‌గా నాని త‌న పాత్ర‌లో ఒదిగిపోయాడు. ప్ర‌ధానంగా కుమారుడిపై త‌న‌కున్న ప్రేమ‌ను చూప‌డంలో ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను కంట‌త‌డి పెట్టిస్తుంది. ఇక తెలుగులో మొద‌టిసారే అయినా.. హీరోయిన శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని చాలా చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంది. జెర్సీ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం అద‌న‌పు బ‌లంగా నిలిచింది. మిగ‌తా న‌టులు స‌త్య‌రాజ్ త‌దిత‌రులు త‌మ‌త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.

చివ‌రిగా…: జెర్సీ మెస్మ‌రైజ్

రేటింగ్ : 3/5

మెస్మ‌రైజ్ చేసిన నాని …జెర్సీ రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share