‘కవచం’ రివ్యూ రేటింగ్ ..

December 7, 2018 at 4:28 pm

‘కవచం’ మూవీ రివ్యూ
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ మామిల్ల
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
నిర్మాత: నవీన్ చౌదరి
సంగీతం: తమన్

స్టార్ ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడు శీను’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. డ్యాన్స్, యాక్షన్, ఫైట్స్ లో ఎంతో అనుభవం ఉన్న హీరోగా కనిపించాడు. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ సమంతతో నటించడంతో మనోడికి మాస్ ఇమేజ్ బాగా వచ్చింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కమర్షియల్ హిట్ కాలేకపోయాయి..కానీ బెల్లంకొండ అబ్బాయికి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మరో స్టార్ హీరోయిన్ కాజల్ తో నటించిన ‘కవచం’సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఓ వైపు తెలంగాణలో పోలింగ్ జరుగుతుండగా…మరికొన్ని సినిమాలు ఉన్నా ‘కవచం’రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా రివ్యూ ఒకసారి చూద్దామా…

కథ : విజయ్(బెల్లంకొండ శ్రీనివాస్) విశాఖపట్టణంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. మొదటి నుంచి సిన్సియర్ గా డ్యూటీ చేయాలని ఆవేశంలో ఉండే యువకుడిగా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుంటాడు. తన వృత్తి పట్ల ఎంతో నిజాయితీగా ఉండే విజయ్ కి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతుంటాడు. కాఫీ షాప్ లో పనిచేసే సంయుక్త ( కాజల్ అగర్వాల్ ) ని ప్రేమిస్తాడు విజయ్ కానీ ఆ ప్రేమ విషయం చెప్పేలోపే ఆమెకు మరొకరితో పెళ్లి కుదురుతుంది. ఇదే సమయంలో ప్రమాదంలో ఉన్న అమ్మాయి ( మెహరీన్ ) ని కాపాడతాడు విజయ్. ఆ తర్వాత యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉన్న విజయ్ తల్లిని ఆదుకోవడానికి సంయుక్త సాయం చేస్తుంది. ఓ అవసరం కోసం సంయుక్త , విజయ్ కిడ్నాప్ డ్రామ ఆడుతారు..సంయుక్తని కిడ్నాప్ చేసినట్లుగా ఆమె మావయ్యకి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తాడు. కానీ, సంయూక్త మరుసటి రోజు నిజంగానే కిడ్నాప్ అవడంతో చిక్కుల్లో పడతాడు విజయ్. సంయుక్త పేరుతో పరిచయమైన మరో అమ్మాయి ఎవరు..? అసలు సంయుక్త స్టోరీ ఏంటి..? మధ్యలో ఈ కిడ్నాప్ డ్రామా ఏంటి..? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల థ్రిల్లర్ జోనర్ లో నడిచే కథను రాసుకున్నాడు. ఆకట్టుకునే ట్విస్ట్ లతో మంచి కథనే సిద్ధం చేసుకున్నాడు. సాధారణంగా థ్రిల్లర్ సినిమా అంటే మనకు కొన్ని అంచనాలుంటాయి. ఈ జానర్లో సినిమా అన్నాక ఎంత పెద్ద హీరో అయినా.. తన హీరోయిజం అంతా మడిచి పక్కన పెట్టి కథలో ఒదిగిపోవాల్సి ఉంటుంది. కానీ తెరపై ఆ కథను తెరకెక్కించే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడంతో సినిమా ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరుస్తుంది. ఈ సినిమాలో హీరో ఎలివేషన్ షాట్స్ కోసం, పాటల కోసం థ్రిల్లర్ కథను కాస్త కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో నడిపించి విసిగించేశారు. ఇంటర్వెల్ సమయానికి ఓ ట్విస్ట్ తో ముగించారు. ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కథ ఎలాంటిదైనా తన ఎలివేషన్ తనకు ఉండాల్సిందే అని కండిషన్ ఏమైనా పెట్టాడో ఏమో తెలియదు కానీ.. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ థ్రిల్లర్ కథను హీరో ఎలివేషన్లతో కమర్షియల్ స్టయిల్లో చెప్పబోయి దీన్ని ఎటూ కాకుండా తయారు చేశాడు. దాంతో ఉత్కంఠ థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకమైన ‘కవచం’ ఆ ఆసక్తిని రేకెత్తించడంలోనే విఫలమైంది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు లాజిక్స్ మిస్ అయ్యాయి. పోలీసులు అంతా కలిసి హీరో కోసం సిటీ మొత్తం గాలిస్తుంటే.. హీరో మాత్రం ఓ క్యాప్ పెట్టుకొని బైక్ మీద సిటీ మొత్తం తిరుగుతూ సింపుల్ గా తన సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటాడు. మొత్తానికి కవచంతో ఆడియన్స్ ని బాగా కన్ఫ్యూజ్ చేసేశారు.

నటీనటులు :
సాక్ష్యం సినిమా నుంచి తన పర్సనాలిటీ బాగా చేంజ్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. పూర్తిగా యాక్షన్ తరహా సినిమాలు తీయలనే ఫిక్స్ అయినట్లు గా బాడీ పెంచాడు. బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో లుక్స్ పరంగా ఓకే అనిపించాడు. కానీ నటన విషయంలో మాత్రం ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో కానిచ్చేశాడు. మిగతా మాస్ మసాలా సినిమాల్లో ఎలా కనిపించాడో.. ఎలా నటించాడో ఇందులోనూ అలాగే చేశాడు. ఈ విషయంలో మనోడికి మంచి మార్కులే వేయొచ్చు. సినియర్ హీరోయిన్ గా కాజల్ గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. హీరోయిన్లిద్దరూ అందంగా కనిపించారు. ఇద్దరివీ కథలో కీలక పాత్రలే కానీ.. నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. విలన్ నీల్ నితిన్ ముకేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హర్షవర్ధన్ రాణె ఓకే. పోసాని తనకు అలవాటైన పాత్రలో కనిపించాడు. మిగతా నటీనటులంతా తమ పరిథిమేరకు నటించారు.

సాంకేతికవర్గం:
కథ, కథనాల్లో సత్తా ఉంటే సాంకేతికంగా ఎలాంటి లోపాలు ఉన్నా పెద్దగా కనిపించవు. కానీ ఈ సినిమాకి అవి లోపించడంతో టెక్నికల్ అంశాలు కూడా ఆకట్టుకునేలా లేవు. శ్రీనివాస్-కాజల్ మీద వచ్చే డ్యూయెట్ ఒక్కటి పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు. ఛోటా కే నాయుడు ఛాయాగ్రహణంలో రిచ్ నెస్ కనిపిస్తుంది కానీ.. కొత్తదనం ఏమీ లేదు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు…సినిమాకు తగ్గట్టు బాగానే ఖర్చు చేశారు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. క్వాలిటీ పరంగా సినిమా మెప్పిస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల ఓ కొత్త దర్శకుడి నుండి ఆశించే వైవిధ్యాన్ని చూపించలేకపోయాడు. ఎన్నో ట్విస్ట్ లతో యాక్షన్ ఎలిమెంట్ ని తీసుకొని కుర్ర హీరోతో కమర్షియల్ ఎటెంప్ట్ చేసినా.. కథనంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది.

పాజిటీవ్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, యాక్షన్ సీన్స్

నెగిటీవ్స్ :ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్, సెకండ్ ఆఫ్ కొన్ని సీన్లు సాగదీయడం

బాటమ్ లేన్ : ట్విస్టులున్నా..‘కవచం’మెప్పించలేదు

రేటింగ్ : 2.5/5

‘కవచం’ రివ్యూ రేటింగ్ ..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share