“ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” వెన్నుపోటు సినిమా రివ్యూ & రేటింగ్

March 29, 2019 at 9:52 am

సినిమా : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
న‌టీన‌టులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌
సంగీతం : కల్యాణీ మాలిక్‌
దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ సినిమాను విడుద‌ల చేయొద్దంటూ టీడీపీ శ్రేణులు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే..ఏపీ హైకోర్టు విధించిన స్టేతో ఏపీలో త‌ప్ప మిగ‌తా అన్ని ఏరియాల్లో ఈ సినిమాను విడుద‌ల చేశారు. విశ్వ‌విఖ్యాత న‌టుడు, రాజ‌కీయ దురంధ‌రుడు, తెలుగు ప్ర‌జ‌ల‌చేత అన్న‌గారు అని పిలిపించుకున్న మ‌హానాయ‌కుడు ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌వేశించిన త‌ర్వాత చోటుచేసుకున్న ఘ‌ట‌న‌ల‌నే క‌థాంశాలుగా తీసుకున్నాడు వ‌ర్మ‌. నంద‌మూరి కుటుంబం నుంచి ల‌క్ష్మీ పార్వ‌తికి ఎదురైన అవ‌మానాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్ర‌ధానంగా ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు ఎపిసోడ్‌ను ఇందులో చూపిస్తార‌నే టాక్ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి వినిపించింది. అయితే.. వ‌ర్మ ముందు నుంచి చెప్పిన‌ట్టుగా ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తిల జీవితాన్ని ఏమేర‌కు చూపించాడో చూద్దాం.

క‌థేమిటంటే…

నిజానికి.. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌కమే. కానీ.. ఎన్టీఆర్‌, ల‌క్ష్మీపార్వ‌తిల జీవితం మాత్రం ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశమే. దీనినే వ‌ర్మ త‌న‌దైన శైలిలో తెర‌కెక్కించాడు. అయితే.. ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త జీవితం ఎక్క‌డ మ‌లుపు తిరిగిందో అక్క‌డి నుంచే వ‌ర్మ సినిమాను మొద‌లుపెట్టాడు. 1989లో ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) అధికారం కోల్పోవ‌డం.. ఆ స‌మ‌యంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) రావ‌డం.. అందుకు ఉన్న‌త విద్యావంతురాలైన‌ లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ అనుమ‌తి ఇవ్వ‌డం నుంచి మొద‌లైన క‌థ‌.. చ‌క‌చ‌కా సాగుతుంది. అయితే.. కొద్దికాలంలోనే ఎన్టీఆర్‌, ల‌క్ష్మీపార్వ‌తిల గురించి త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లు కావ‌డం.. ఇది కాస్తా ఎన్టీఆర్ దృష్టికి రావ‌డంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తారు. తాను లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్‌ ప్రకటిస్తారు. 1994లో లక్ష్మీతో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతారు. ఎన్టీఆర్‌ అల్లుడైన బాబు రావ్‌ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతిపై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం.. ఏకంగా నంద‌మూరి కుటుంబాన్నిబెదిరించి త‌న‌వైపు బాబురావ్ తిప్పుకోవ‌డం.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్య‌మంత్రి పీఠం లాక్కోవ‌డం.. ఆ త‌ర్వాత పదవి కోల్పోయిన ఎన్టీఆర్ ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన‌డం.. ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయడం.. కుంగిపోయి తుదిశ్వాస వ‌దులుతారు.

ఎలా ఉందంటే…

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్న‌ప్ప‌టి నుంచే వ‌ర్మ చెబుతున్నాడు. ఎన్టీఆర్ జీవితాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తాను చూపిస్తాన‌ని వ‌ర్మ చెప్పాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా పోస్ట‌ర్‌, ట్రైల‌ర్లు, పాట‌లను విడుద‌ల చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అనేక ఊహాగానాలకు తెర‌దించుతూ.. సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత చోటు చేసుకున్న ప్ర‌తీ అంశాన్ని వ‌ర్మ క‌ళ్ల‌కు క‌ట్టాడ‌నే చెప్పొచ్చు. నంద‌మూరి కుటుంబం నుంచి ల‌క్ష్మీపార్వ‌తికి ఎదురైన అవ‌మానాల‌ను, ఎన్టీఆర్ జీవితాన్ని బాబురావ్ త‌న కుట్ర‌ల‌తో, వెన్నుపోటుతో ఎలా దెబ్బ‌తీశాడో వ‌ర్మ సూటిగా తెర‌పై ఆవిష్క‌రించాడు. ఎక్క‌డ కూడా సోదికి అవ‌కాశం లేకుండా.. తాను చూపించాల్సిన అంశాన్ని, చెప్ప‌ద‌ల్చుకున్న విష‌యాన్ని త‌న‌దైన శైలిలో బ‌ద్ద‌లు కొట్టాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఒంట‌రి జీవితం, ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌వేశం, వారి మ‌ధ్య ప్రేమానురాగాలు, నంద‌మూరి కుటుంబం కుట్ర‌లు, దీని వెనుక ఉన్న అస‌లు వ్య‌క్తి ఎవ‌రు..? ఇలా అన్న‌గారి ఆవేద‌న‌ను, ల‌క్ష్మీపార్వ‌తి వేద‌న‌ను చూపించ‌డంలో వ‌ర్మ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పొచ్చు.

ఎవ‌రెలా చేశారంటే..

న‌టీన‌టుల ఎంపిక‌తోనే వ‌ర్మ సగం స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఈ సినిమాలోని న‌టీన‌టులంద‌రూ కూడా టాలీవుడ్‌కు కొత్త‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్ చిత్ర‌సీమ‌కే కొత్త‌. ఆయ‌న‌ రంగస్థల నటుడు. ఆయ‌న ఎన్టీఆర్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. అన్న‌గారి హావ‌భావాల‌ను ప‌లికించ‌డంలో విజ‌య్ కుమార్ మెప్పించాడు. ఇక ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో న‌టించిన యజ్ఞశెట్టి నటన సినిమా మొత్తానికే హైలెట్ అని చెప్పొచ్చు. ఆమె ప‌లికించిన హావ‌భావాలు అద్భుతం. ప్ర‌తీ స‌న్నివేశంలో ఆమె లీన‌మైపోయారు. అమాయ‌క‌త్వం, క‌ల్మ‌శంలేని ప్రేమ‌, వేదన, అవమాన భారం.. బాధ‌.. ఇలా అన్ని భావాలను ఆమె అల‌వోక‌గా ప‌లికించారు. ఇక్క‌డ మ‌రో పాత్ర బాబు రావ్‌. ఈ పాత్రకు శ్రీతేజ్ జీవం పోశాడు. కుట్ర‌కుతంత్రాలు, వెన్నుపోటు రాజ‌కీయాన్ని ఆయ‌న ముఖ‌క‌వ‌లిక‌ల్లోనే చూపించాడు. త‌న పాత్ర‌కు వంద‌కువంద‌శాతం న్యాయం చేశాడు. న‌టీన‌టుల నుంచి త‌న‌కు కావాల్సిన న‌ట‌న‌ను రాబ‌ట్టుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు వ‌ర్మ స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. కల్యాణీ మాలిక్ అందించిన సంగీతం సినిమాకు అద‌న‌పు బ‌లంగా నిలిచింది. ఇక సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

చివ‌రిగా.. వెన్నుపోటును క‌ళ్ల‌కు క‌ట్టాడు

రేటింగ్ 3/5

“ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” వెన్నుపోటు సినిమా రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share