క‌లెక్ష‌న్స్ రిపోర్ట్‌: హిట్ ఎవ‌రు… ఫ‌ట్ ఎవ‌రు..

టాలీవుడ్‌లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్క‌డు మిగిలాడు మాత్ర‌మే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువార‌మే థియేట‌ర్ల‌లోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మ‌నోజ్ ఒక్క‌డు మిగిలాడు – సందీప్ కిష‌న్ కేరాఫ్ సూర్య వ‌చ్చాయి.

ఈ నాలుగు సినిమాల వ‌సూళ్ల వివ‌రాలు చూస్తే అదిరింది సినిమా ఇప్ప‌టికే రూ.7 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రూ.4 కోట్ల షేర్‌తో ఓ మీడియం రేంజ్ తెలుగు సినిమాలా వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రై లాభాల భాట‌ప‌ట్టిన‌ట్టే. విజ‌య్‌కు ఈ సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్ప‌డిన‌ట్టే అంటున్నారు.

ఇక విశాల్ డిటెక్టివ్ సినిమాకు టాక్ బాగున్నా ఏ క్లాస్ మూవీ, కేవ‌లం ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు రూ.కోటి షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియల్‌గా డిటెక్టివ్ ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతుందో ?  చూడాలి. మిగిలిన సినిమాల్లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌చ్చిన సందీప్ కిష‌న్ కేరాఫ్ సూర్య రూ.45 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టి డిజాస్ట‌ర్ దిశ‌గా వెళుతోంది.

ఇక మంచు మ‌నోజ్ ఒక్క‌డు మిగిలాడు తొలి రోజు తొలి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుని ఇప్ప‌టి వ‌ర‌కు రూ.25-30 ల‌క్ష‌ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. దీంతో ఈలెక్క‌న ఈ సినిమా మ‌నోజ్ హిస్ట‌రీలోనే పెద్ద డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డం ఖాయ‌మైంది. ఓవ‌రాల్‌గా నాలుగు సినిమాల్లో విజ‌య్ అదిరింది ఇప్ప‌టికే హిట్ కేట‌గిరిలోకి చేరుకోగా, ఇక విశాల్ డిటెక్టివ్ మాత్రం కాస్తో కూస్తో ప్ర‌భావం చూపొచ్చు. మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ టాక్‌తో డిజాస్ట‌ర్ దిశ‌గా వెళుతున్నాయి.