చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం

September 26, 2016 at 10:30 am

100 మ్యాచ్‌లు ప్రత్యేకం.. 200 మ్యాచ్‌లు ఇంకా ప్రత్యేకం. 500వ మ్యాచ్‌ అంటే ఇంకా ఇంకా స్పెషల్‌. అంతటి చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థిపై భారీ విజయమంటే అది చారిత్రాత్మక విజయం కాకుండా ఎలా ఉంటుంది? కోహ్లీసేన ఆ ఘనతను సాధించింది. టీమిండియా 500వ మ్యాచ్‌లో 130వ విజయాన్ని నమోదు చేసి భారత క్రికెట్‌ అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కనాకష్టంగా 300 పరుగుల మార్క్‌ని దాటగలిగింది. అయితే, బౌలర్లు మాత్రం 300 పరుగుల లోపే న్యూజిలాండ్‌ని కట్టడి చేయగలగడంతో మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం దక్కింది.

 తొలి ఇన్నింగ్స్‌లో కొంచెం నిరాశపరిచిన భారత బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగారు. 400 పరుగులపైన టార్గెట్‌ నిర్దేశిస్తూ ఇంకా 5 వికెట్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ని డిక్లేర్‌ చేశాడు కెప్టెన్‌ కోహ్లీ. ఆ వ్యూహం ఫలించింది. ముందుగానే టపటపా వికెట్లు తీశారు భారత బౌలర్లు, మధ్యలో న్యూజిలాండ్‌ ఆటగాళ్ళు కాస్త ప్రతిఘటించారు. డ్రా చేసేసుకుంటారేమోనని భారత క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందారు. కానీ బౌలర్లు మళ్ళీ చెలరేగి, న్యూజిలాండ్‌ని పెవిలియన్‌కి పంపించారు. దాంతో చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది.

చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share